తిరుమలలో చిరుత కలకలం .. మొదటి ఘాట్ రోడ్‌లో కెమెరాకు చిక్కిన వైనం, రంగంలోకి అధికారులు
తిరుమల మొదటి ఘాట్ రోడ్ ఎలిఫెంట్ అర్చీ వద్ద మరొక చిరుత సంచరిస్తున్నట్లుగా గుర్తించారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో చిరుత సంచరిస్తున్నట్లుగా గుర్తించారు.
తిరుమలలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. ఇటీవల చిరుత సంచారం, బోనులో చిక్కిన చిరుత ఘటన మరవకముందే తిరుమల మొదటి ఘాట్ రోడ్ ఎలిఫెంట్ అర్చీ వద్ద మరొక చిరుత సంచరిస్తున్నట్లుగా గుర్తించారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో చిరుత సంచరిస్తున్నట్లుగా గుర్తించారు. ఇదిలావుండగా తిరుమల స్పెషల్ టైప్ కాటేజీల సమయంలో ఓ ఎలుగుబంటి కెమెరాకు చిక్కింది. దీంతో ఆ సమీప ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
మరోవైపు.. తిరుమలగిరుల్లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. భక్తుల సంరక్షణ కోసం టీటీడీ అధికారులు మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. భక్తులు నిఘా నీడలో కాలినడక సాగించడం, చిరుతలను బంధించడం , చిరుతల సంచారంపై అధ్యయనం చేయడం వంటి వ్యూహాలను అమలు చేస్తున్నారు. శ్రీశైలం నుంచి వచ్చిన బృందం చిరుతల సంచారంపై అధ్యయనం చేయనుంది.
ఇకపోతే.. పులుల నుంచి భక్తులు తమను తాము రక్షించుకోవడానికి కొన్ని నిబంధనలు పాటించాలని అధికారులు చెప్పారు. అందులో ఒక నిబంధన కర్రలు పట్టుకుని నడవాలని ఉన్నది. ఈ నిబంధన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశమైంది. కేవలం కర్రలతో పులిని బెదిరించి పంపిచేయొచ్చా? కర్రలు పులుల నుంచి భక్తుల ప్రాణాలను కాపాడుతుందా? ఇది సరైన నిర్ణయమేనా? అనే చర్చ మొదలైంది. తాజాగా, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
Also Read: తిరుమల భక్తులకు కర్రలు ఇవ్వడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్.. టీటీడీ చైర్మన్ భూమన రియాక్షన్ ఇదే..
అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు అమలాపురంలో గడియారం స్తంభం సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తిరుమత వెంకటేశ్వర స్వామి అందరి ఆరాధ్య దైవం అని చంద్రబాబు అన్నారు. అందుకోసం ఆయన దర్శనానికి తిరుపతి వెళ్లుతామని తెలిపారు. తిరుమలలో పులులు ఉన్నాయని భక్తులకు కర్రలు ఇస్తున్నారని చెప్పారు. ఇంటికో కర్ర తరహా పాత రోజులను గుర్తు చేస్తున్నారని పేర్కొన్నారు.
భక్తులు ఇలా కర్రలు పట్టుకుని శ్రీవారిని చూడడానికి వెళ్లుతున్నట్టు లేదని, తిరుమలలో పులులను చంపడానికి వెళ్లుతున్నట్టు ఉన్నదని చంద్రబాబు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. చేతిలో కర్ర ఉంటే పులి పారిపోతుందా? అంటూ ప్రశ్నించారు. పులుల బారినుండి తప్పించుకోవడానికి చేతి కర్రలు ఇచ్చే నిర్ణయం సరైనదేనా? అని అడిగారు. సమర్థ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటుందా? అంటూ ప్రశ్నించారు. ఇంటికో కర్ర పెట్టుకుని వాటితో వైసీపీ దొంగలను తరిమికొట్టాలని చంద్రబాబు సూచించారు.