రానున్న ఎన్నికలతో పాటు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర నేటితో ఏడాది పూర్తి చేసుకుంది.

2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మారక స్థలం నుంచి జగన్ పాదయాత్రను ప్రారంభించారు. ఇప్పటి వరకు 294 రోజుల్లో 11 జిల్లాల్లోని 122 నియోజకవర్గాల మీదుగా ఆయన యాత్ర సాగింది.

దీనిలో 1739 గ్రామాలు, 205 మండలాలు, 47 పురపాలక సంఘాలు, 8 కార్పోరేషన్ల ప్రజలతో మమేకమయ్యారు. మొత్తం 113 బహిరంగసభలు, 42 చోట్ల ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

అయితే కోర్టుకు హాజరయ్యేందుకు విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు వేచిచూస్తున్న జగన్‌పై శ్రీనివాసరావు అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ వేశారు వైసీపీ చీఫ్.

మరోవైపు తన పాదయాత్ర ఏడాది పూర్తి చేసుకోవడంపై జగన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘ ప్రజల అభిమానం, దేవుడి ఆశీస్సులతో ఏడాది కాలంగా ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో నాకు మద్ధతు పలికిన ప్రతి హృదయానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

గాయం నుంచి కోలుకుంటున్నాను... మీ అందరి తోడుగా.. మీ ఆత్మీయతల మధ్య  అతి త్వరలో తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తాను. ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలిగించాలన్నదే నా సంకల్పం, నా తపన ’’ అంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.