Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు శివారులో విషాదం.. భవన నిర్మాణ పనుల్లో మట్టిపెళ్లలు పడి ముగ్గురు వలస కార్మికులు దుర్మరణం

గుంటూరు శివారులో విషాదం చోటుచేసుకుంది. అమరావతి రోడ్డు సమీపంలో నిర్మిస్తున్న మల్టిప్లెక్స్ కోసం సుమారు 40 అడుగుల లోతు పునాది తీశారు. అక్కడే పని చేస్తున్న కార్మికులపై మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. ఆ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మట్టిపెళ్లల కిందే చిక్కుకుపోయారు. వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు వలస కార్మికులు దుర్మరణం చెందారు.

one worker died in mutliplex building cite in an accident
Author
First Published Mar 16, 2022, 12:17 PM IST | Last Updated Mar 16, 2022, 2:48 PM IST

అమరావతి: గుంటూరు శివారులో అమరావతి రోడ్డు సమీపంలో ముత్యాలరెడ్డి నగర్‌లో దుర్ఘటన చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనుల్లో మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం జరగ్గానే స్థానికులు వెంటనే అప్రమత్తం అయ్యారు. సహాయక చర్యల్లో దిగారు. మట్టిపెళ్లల కింద చిక్కుకున్న ఒక కార్మికుడి మృతదేహాన్ని వెలికి తీశారు. ఆ తర్వాత మరో కార్మికుడి డెడ్ బాడీని కూడా వెలికి తీశారు. మొత్తంగా ముగ్గురు కార్మికులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బెంగాల్, బిహార్‌లకు చెందిన మజ్ను, నజీబ్, అమీన్‌లుగా మృతులను గుర్తించారు. కాగా, జీజీహెచ్‌లో మరో ఇద్దరు వలస కార్మికులకు చికిత్స అందిస్తున్నారు.

అమరావతి రోడ్డు సమీపంలో నిర్మిస్తున్న ఓ మల్టీప్లెక్స్ సెల్లార్ నిర్మాణం కోసం సుమారు 40 అడుగుల లోతు పునాది తీశారు. ఈ పునాది తీసి అందులో ఐరన్ రాడ్‌ల బెండింగ్‌కు సంబంధించిన పనులు చేస్తున్నారు. ఈ పని చేస్తుండగా పూడిక తీసిన భాగంలో మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. ఈ మట్టిపెళ్లల కింద సుమారు ఐదుగురు చిక్కుకున్నారు.

వీరంతా బిహార్, పశ్చిమ బెంగాల్ నుంచి వలస వచ్చిన కార్మికులు. 20 నుంచి 30 అడుగుల లోతు తీసిన పునాదిలోనే ఇనుప రాడ్లకు సంబంధించిన పనులు చేస్తున్నారు. అప్పుడు సుమారు 40 నుంచి 50 మంది కార్మికులు అక్కడ ఉన్నారని స్థానికులు చెప్పారు. ఇనుప రాడ్లకు సంబంధించిన పనులు చేస్తున్న సమయంలో మట్టిపెళ్లలు కూలాయి. ఆ ఘటనలో ఐదుగురు కార్మికులు చిక్కుకుపోయారు. వెంటనే అక్కడే ఉన్న ఇతర కార్మికులు, స్థానికులు సహాయ చర్యల్లోకి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు తృటిలో తప్పుకున్నారు. అంటే తక్కువ మట్టిపెళ్లలు పడటంతో బయటపడ్డారు. కానీ, ముగ్గురిపై ఎక్కువగా మట్టిపెళ్లలు పడ్డాయి.

అందులో ఇద్దరు పూర్తిగా మట్టిపెళ్లల కింద చిక్కుకుపోయినట్టు తెలిసింది. ఒకరు సగం మేరకు మట్టిపెళ్లల కింద చిక్కుకున్నారు. ఆయనను వెంటనే స్థానికులు బయటకు తీసి స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. కాగా, మిగతా ఇద్దరి కోసం గాలింపులు ముమ్మరంగా చేపట్టారు. అందులో ఒకరి మృతదేహం తొలుత వెలికి వచ్చింది. కాగా, అదే శిథిలా కింద మరొకరు చిక్కుకుని ఉన్నట్టు స్థానికులు భావించారు. ఆయన కోసం గాలింపులు జరపగా.. మరో మృతదేహం బయట పడింది. తాజాగా, ఈ ఘటనలో మొత్తం ముగ్గురు మరణించారని అధికారులు చెప్పారు.

ఘటనాస్థలికి హుటాహుటిన నగర మేయర్ మనోహర్ నాయుడు, కమిషనర్ వచ్చారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, వారికి అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు. అయితే, ఈ మల్టిప్లెక్స్ నిర్మాణం, సెల్లార్ నిర్మాణానికి సంబంధించిన అనుమతుల గురించి ఆరా తీస్తున్నామని వివరించారు.

కాగా, కార్మికు సంఘాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిర్లక్ష్యం కారణంగానే కార్మికులు మరణించారని ఆరోపించారు. యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు, గాయపడినవారికీ న్యాయం చేయాలని నినాదాలు ఇచ్చారు. స్పాట్‌లో వారు నిరసనలు చేస్తున్నారు.

కాగా, ఈ ప్రమాదానికి ప్రధాన కారణం నిర్లక్ష్యమేనని, ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ నిర్మాణాలు చేపడుతున్న ఎస్‌వీ బిల్డర్స్ అండ్ అసోసియేట్స్‌పై చర్యలకు రంగం సిద్ధం అవుతున్నదని సమాచారం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios