నారాయణలో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు తాజాగా మరో విద్యార్థి బలవన్మరణం పట్టించుకోని ప్రభుత్వం

రాష్ట్రంలోని నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థుల బలవన్మరణాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా గూడవల్లి నారాయణ క్యాంపస్ లో ఈశ్వర్ రెడ్డి అనే విద్యార్థి తనువు చాలించాడు. గడచిన మూడున్నర సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులోనూ కేవలం నారాయణ విద్యా సంస్థల్లో 50మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. కళాశాలల్లో.. పెడుతున్న ఒత్తిడిని తట్టుకోలేక వారు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. గొప్ప విద్యా సంస్థల్లో విద్యనభ్యసిస్తారని భావించి తల్లిదండ్రులు పిల్లలను నారాయణలో చేర్పిస్తే.. వారు ఉన్నతులుగా కాకుండా శవాలై బయటకు వస్తున్నారు.

ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు వెలుగు చూస్తున్నా.. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఆ విద్యా సంస్థల యజమాని..నారాయణ ఏపీ మంత్రి వర్గంలో చాలా ముఖ్యుడు. అంతేకాదు.. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయనకు వియ్యంకుడు. అందుకే ప్రభుత్వం ఎంత మంది ఆణిముత్యాలు నేలకొరుగుతన్నా.. పట్టనట్టు వ్యవహరిస్తోంది.

సాధారణంగా విద్యా సంస్థల్లో ఇలాంటి దారుణాలు చోటుచేసుకుంటే.. వీటిపై ఆ శాఖ మంత్రి చర్యలు తీసుకుంటుంది. ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు అని తెలియగానే.. కళాశాలలను మూసివేస్తారు. కానీ.. ఇక్కడ మాత్రం అలాంటివి జరగడం లేదు. గుంటూరు, కృష్ణా, విశాఖ పట్నం, తిరుపతి వంటి జిల్లాల్లో పలువరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడినా చర్యలు తీసుకోవడం లేదు. నారాయణ విద్యా సంస్థల యజమాని స్వయానా తనకు వియ్యంకుడు కావడంతో విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ విషయంలో స్పందించడం లేదు. పైగా నారాయణ కళాశాలలకు అండగా నిలుస్తున్నాడు. ఘటన జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పడం.. తర్వాత ఆ ఊసుకూడ ఎత్తడం లేదు.

చదువు పేరిట విద్యార్థులపై ఒత్తిడి తేవడమే కాదు.. వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులను కూడా బయపెడుతున్నారట కేసులు పెట్టకుండా. కనీసం వారి పిల్లలు చనిపోయారనే విషయాన్ని కూడా వారి పేరెంట్స్ కి వెంటనే చెప్పడం లేదు.

కళాశాలలో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విద్యార్థి పింగళి ఈశ్వర్ రెడ్డి విషయంలోనూ ఇదే జరిగింది. ఆ పిల్లవాడు చనిపోయినా.. వారి పేరెంట్స్ కి తెలియలేదు. కళాశాల యాజమాన్యం చెప్పకుండా గోప్యంగా ఉంచింది. వేరే గ్రామానికి చెందిన విద్యార్థులు ఫోన్ చేసి చెప్తే గానీ ఈ విషయం వెలుగులోకి రాలేదు. అయితే.. టీచర్లు.. దారుణంగా కొట్టడం వల్లనే ఆ బాలుడు చనిపోయినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు.బాలుడి శరీరంపై కర్రలతో కొట్టిన వాతలు కనిపిస్తున్నాయని.. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఈశ్వర్ రెడ్డి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి వర్యులు.. బంధు ప్రీతిని వదిలి.. చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.