ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడులో ఓ కోళ్ల రైతు దగ్గరున్న కోడి ధర తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే. ఏడు కిలోల బరువుతో ఉన్న ఈ కోడి ధర అక్షరాలా లక్ష రూపాయలు. ఎందుకంత రేటు.. దీని ప్రత్యేకత ఏంటీ అంటే...

ఈ కోడి  తెల్లటి రంగులో 7 కిలోల బరువు, 28 అంగుళాల ఎత్తు, చిలుక ముక్కు, డేగ లాంటి శరీర సౌష్టవంతో ఆకట్టుకుంటోంది ఈ కోడిపుంజు. దీన్ని గిద్దలూరుకు చెందిన మందగంటి పెద్ద పుల్లయ్య పెంచుతున్నాడు. పుల్లయ్య గత 30 ఏళ్లుగా కోళ్ల పెంపకంలో ఆరితేరాడు. 

అరుదైన జాతి కోళ్ల పెంపకంలో నాలుగేళ్లుగా స్పెషాలిటీ సాధించాడు. మొదట్లో తాపీమేస్త్రీగా పనిచేశాడు పుల్లయ్య. చిన్నతనంనుండే ఇంట్లో వివిధ రకాల నాటు, బెడస తదితర జాతి కోళ్లను పెంచేవాడు. నాలుగేళ్ల క్రితం తాపీమేస్త్రీ పని చాలించుకుని గ్రామంలోనే 2 ఎకరాల పొలం కొని సాగు చేస్తున్నాడు. 

కోళ్లపెంపకంలో తన ముద్ర ఉండాలంటే అరుదైన జాతి కోళ్లను పెంచాలనుకున్నాడు. దీనికోసం తమిళనాడు, పొల్లాచ్చిలో పెద్దపర్ల జాతికి చెందిన ఏడు నెలల వయసు గల కోడిని రూ.లక్షకు కొనుగోలు చేశాడు. 

ఆ కోడి ఇంటికి చేరేసరికి మొత్తం ఖర్చు రూ.1.24 లక్షలు అయింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటువంటి అరుదైన జాతి పుంజు లేదని పుల్లయ్య గర్వంగా చెబుతున్నాడు. అంతేకాదు పుల్లయ్య దగ్గరున్న ఒక్కోకోడి 30వేల రూపాయలకు తక్కువ ఉండదు. 

కోళ్ల దాణాకూడా ఇంతే ఖరీదు ఉంటుంది. ఒక్కో కోడికి దాణా కోసం నెలకు రూ.3 వేలు ఖర్చు అవుతుంది. బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఉడికించిన గుడ్డు, శనగలు, వేరుశనగలు, రాగులు, సజ్జలను దాణాగా పెట్టాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పిల్లలకు తినిపించినట్లు తినిపించాల్సి వస్తుంది. 

కోళ్ల పెంపకం ద్వారా నెలకు రూ.30 వేలకు వరకు ఆదాయం పొందుతున్నాడు పుల్లయ్య. ఈయన దగ్గర కోళ్లే కాదు.. గుడ్డు, కోడిపిల్లకూడా మాంచి రేటు పలుకుతుంది. ఒక్కో గుడ్డును వెయ్యిరూపాయలకు, పది రోజుల కోడి పిల్ల రూ.5 వేలకు అమ్ముతున్నాడు.