భీమవరం: పిల్లలకు ఆట విడుపుతోపాటు ఆనందాన్ని ఇచ్చే జెయింట్ వీల్స్ సందర్శకుల పాలిట మృత్యువుగా మారుతున్నాయి. ఎగ్జిబిషన్ నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటించకుండా సందర్శకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. 

దీంతో ఎగ్జిబిషన్ కు వెళ్లాలంటేనే హడలిపోతున్నారు సందర్శకులు. ఇటీవల ఎగ్జిబిషన్ లోపాలతో చిన్నారులు ప్రాణాలు కోల్పోగా...తాజాగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మరో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లూధరన్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న మాధురి ట్రేడ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. 

అయితే ఈ ఎగ్జిబిషన్ లో జెయింట్ వీల్ ఎక్కిన ఇద్దరు యువకులు జారి పడ్డారు. వారిలో ఆనంద్ పాల్ అనే యువకుడు దుర్మరణం చెందగా  సత్యనారాయణ అనే యువకుడు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. 

యువకులిద్దరూ ఎగ్జిబిషన్ లో పార్ట్ టైమ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అయితే ప్రమాదంపై సందర్శకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన జెయింట్ వీల్ పై 40 మంది చిన్నారులు ఉన్నారు. దీంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. భద్రతా ప్రమాణాలపై ఆరా తీశారు.