Asianet News TeluguAsianet News Telugu

పోలీసు స్టేషన్ పై దాడి: ఎస్సైని, పోలీసులను చితకబాదారు

నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్‌ స్టేషన్‌పై బుధవారం రాత్రి దాడి జరిగింది. దళితవాడకు చెందిన కొందరు పోలీస్‌స్టేషన్‌ గేట్లు ధ్వంసం చేసి, లోపలికి వెళ్లారు. పోలీసులపై విచక్షణారహితంగా దాడి చేశారు.  ఈ ఘటనలో పోలీసులు నలుగురిని కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

On Camera, Cops Beaten Up Inside Police Station In Andhra Pradesh

నెల్లూరు: నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్‌ స్టేషన్‌పై బుధవారం రాత్రి దాడి జరిగింది. దళితవాడకు చెందిన కొందరు పోలీస్‌స్టేషన్‌ గేట్లు ధ్వంసం చేసి, లోపలికి వెళ్లారు. పోలీసులపై విచక్షణారహితంగా దాడి చేశారు.  ఈ ఘటనలో పోలీసులు నలుగురిని కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆ సంఘటనలో ఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. రాపూరు దళితవాడకు చెందిన పిచ్చయ్య, కనకమ్మ, లక్ష్మమ్మ తదితరులు అదే ప్రాంతానికి చెందిన జోసెఫ్‌కు అప్పు ఉన్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతో జోసెఫ్‌ రాపూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

దాంతో పిచ్చయ్యతోపాటు ఇద్దరు మహిళలను విచారించేందుకు పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అప్పటికే మద్యం సేవించిన పిచ్చయ్యను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా, వారి బంధువులు దాదాపు 150 మంది పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు.

దాదాపు 40 మంది స్టేషన్‌లోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న పోలీసులపై దాడికి దిగారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ లక్ష్మణ్‌ను బయటకు లాక్కొచ్చి కొట్టారు. అడ్డువచ్చి న ముగ్గురు కానిస్టేబుళ్లపై కూడా దాడి చేశారు. 

గాయపడిన ఎస్‌ఐని, కానిస్టేబుళ్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  పోలీసులు తమను విచారణ కోసం పిలిపించి మహిళలు అని కూడా చూడకుండా కొట్టారని,  కులం పేరుతో దూషించారని దళితవాడకు చెందిన పిచ్చయ్య, కనకమ్మ, లక్ష్మమ్మ ఆరోపించారు. తమతోపాటు పెంచలయ్య అనే యువకుడిని కూడా పోలీసులు కొట్టారని చెప్పారు.  

దళితవాడ వాసుల దాడిలో గాయపడ్డ రాపూరు ఎస్‌ఐ, కానిస్లేబుళ్లను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయించామని డీఎస్సీ రాంబాబు చెప్పారు. ఎస్‌ఐ తలకు బలమైన గాయం అయిందని అన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, బాధ్యులపై చట్టపరిధిలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసు స్టేషన్ పై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios