విశాఖపట్నం: మొద్దు శీను హత్య కేసులో ప్రధాన నిందితుడు ఓం ప్రకాష్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఓం ప్రకాశ్ ఇటీవల విశాఖపట్నంలోని కెజిహెచ్ లో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఓ ప్రకాష్ కు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దాంతో విశాఖ సెంట్రల్ జైలు సిబ్బంది, కేజీహెచ్ సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. 

పరిటాల హత్య కేసులో నిందితుడు మొద్దు శీనును జైలులో హత్య చేసిన కేసులో ఓం ప్రకాష్ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ విశాఖ జైలులో ఉన్నాడు. ఇటీవల కిడ్నీ సమస్యలకు కెజీహెచ్ లో చికిత్స పొందుతూ మరణించాడు.

ఓ చోరీ కేసుకు సంబంధించి 2007 పోలీసులు అరెస్టు చేసి జిల్లా జైలుకు పంపించారు. పరిటాల హత్య కేసు నిందితుడు మొద్దు శీను అప్పుడు అదే జైలులో ఉన్నాడు. 2008 నవంబర్ 9వ తేదీ తెల్లవారు డామును సిమెంట్ డంబుల్స్ తో మొద్దు శీను తలపై కొట్టాడు. దాంతో మొద్దు శీను మరణించాడు. ఈ కేసులో అనంతపురం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఓం ప్రకాష్ కు జీవిత ఖైదు విధించింది. 

ఆ తర్వాత అతన్ని అనంతపురం జిల్లా జైలు నుంచి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కడప జైలులో అతను సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో అక్కడి నుంచి నెల్లూరు జైలుకు తరలించారు. ఆయ సమయంలో అతనికి కిడ్నీ సమస్యలు తలెత్తాయి. 

నెల్లూరులో కిడ్నీ డయాలసిస్ కు అవకాశం లేకపోవడంతో 2016లో విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. తాజాగా అతను కేజిహెచ్ లో చికిత్స పొందుతూ మరణించాడు. ఓం ప్రకాశ్ శవాన్ని కెజిహెచ్ మార్చురీలో భద్రపరిచారు.