నంద్యాల: తన భూమిని అధికార వైసిపి ఎమ్మెల్యే కబ్జా చేశాడంటూ ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మహిళ ఇప్పటికీ తనకు న్యాయం జరక్కపోతే ఈసారి కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. ఈ ఈ ఘటన కర్నూల్ జిల్లా నంద్యాలలో చోటుచేసుకుంది.  

నంద్యాల పట్టణంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన లక్ష్మీదేవి భర్త కొన్నేళ్ల కిందట చనిపోయాడు. అయితే అతడికి తన అన్నతో కలిపి పట్టణంలోనే 1.29 ఎకరాల భూమి ఉంది. అయితే తాజాగా ఆ భూమిలోని 55 సెంట్లు బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆయన కుమారుడు కాటసాని ఓబుల్ రెడ్డి పేరిట రిజిస్టర్ అయినట్లు తెలుసుకున్న లక్ష్మీదేవి దారుణ నిర్ణయం తీసుకుంది. తనకు అన్యాయం జరిగిందంటూ ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. 

ప్రస్తుతం లక్ష్మీదేవి పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు సమాచారం. అయితే తమకు న్యాయం జరక్కపోతే ఈసారి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని ఆమె కూతురు భాగ్యలక్ష్మి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తమకు జరిగిన అన్యాయంపై వెంటనే స్పందించి న్యాయం జరిగేలా చూడాలని బాధిత మహిళతో పాటు ఆమె కూతురు వేడుకున్నారు. 

అయితే తాము ఎవరి భూమి కబ్జా చేయలేదని బనగానపల్లి ఎమ్మెల్యే రామిరెడ్డి పేర్కొన్నారు. 55 సెంట్ల భూమిని లక్ష్మీదేవి బావ వీరారెడ్డి నుంచి కొనుగోలు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.