తనపై అపార్ట్ మెంట్ కమిటీ సభ్యులు తప్పుడు ఆరోపణలు చేశారని.. వాటిని తట్టుకొని నిలబడే శక్తి.. ఈ వయసులో తనకు లేదని.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ.. ఓ వృద్ధుడు లేఖ రాసి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసి రిటైర్‌ అయిన కోరుకొండ లక్ష్మీపతిరావు (84) తణుకు సజ్జాపురంలో అపార్టుమెంటు అయిదో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

కాగా.. చనిపోవడానికి ముందు ఓ లేఖ రాసి మరీ.. తనచావుకు గల కారణాలను వివరించారు. ‘నా వయసు 84 సంవత్సరాలు.. అపార్టుమెంటు కమిటీ సభ్యులు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.. నన్ను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు.. ఈ వయసులో నాకు పోరాడే శక్తి లేదు.. ఇలాంటి పోలీసు కేసులు ఎదుర్కొనే సహనం లేదు.. అందుకే నిస్పృహతోనే ఆత్మహత్య చేసుకుంటున్నాను..’ అంటూ వృద్ధుడు సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

కాగా.. ఆయన రాసిన లేఖ పలువురి చేత కంటతడి పెట్టిస్తోంది. ఎంతో మంది పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తూ ఉచితంగా వసతి కల్పించే లక్ష్మీపతిరావుకు స్థానికంగా మంచి పేరు ఉంది. అలాంటి వ్యక్తి ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవడం స్థానికులను కలచివేస్తోంది.