పోలవరం పనులు జరగకపోవటానికి ట్రాన్స్ టాయ్ సంస్ధ నిర్లక్ష్యమే కారణమని తెగేసి చెప్పారు. సంస్ధకు అసలు మానవవనరుల సామర్ధ్యమే లేదని తేల్చి చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు టిడిపికి వరమో లేక శాపమో అర్ధం కావటం లేదు. ఎందుకంటే వరమనుకున్న ‘పోలవర’మే చివరకు తెలుగుదేశంపార్టీ పుట్టిముంచేట్లున్నది. సామాజికవర్గం పేరుతోనే ఇంకేదో కారణంతోనో ప్రాజెక్టు పనులు మొత్తం ట్రాన్స్ టాయ్ కు చంద్రబాబు అప్పగించారు. సంస్ధేమో డబ్బులు తీసుకుంటోంది కానీ పనులు మాత్రం చేయటం లేదు. పైగా పనులు చేసిన సబ్ కాంట్రాక్టర్లకు, ఏజెన్సీలకు డబ్బులు చెల్లించకపోవటంతో అవీ చేతులెత్తేస్తున్నాయి. దాంతో ఏం చేయాలో చంద్రబాబుకు దిక్కుతోచటం లేదు. స్వయంగా పనుల పురోగతిని పరిశీలించిన చంద్రబాబుకు సంస్ధ యాజమాన్యాన్ని ఏ విధంగా దారితీసుకురావాలో అర్ధం కావటం లేదు.

పోలవరం పనులు అనుకున్నంత వేగంగా జరగకపోవటానికి ట్రాన్స్ టాయ్ సంస్ధే కారణమంటూ అధికారులు తేల్చిచెప్పారు. టిడిపి అధికారంలోకి రాగానే పోలవరం పనులను ట్రాన్స్ టాయ్ సంస్ధ పెద్ద ఎత్తున చేజిక్కించుకున్నది. ట్రాన్స్ టాయ్ అంటే నరసరావుపేట టిడిపి ఎంపి రాయపాటి సాంబశివరావుదని ఎవరిని అడిగినా చెప్పేస్తారు. గడచిన మూడేళ్ళుగా పోలవరం పనులు నత్తకు బాబులాగ జరుగుతున్నాయి. ఎన్నోసార్లు అధికారులు మొత్తుకుంటున్నా యాజమాన్యం లెక్క కూడా చేయలేదు.

కేంద్రం నిధులు ఇవ్వక, ఇక్కడ పనులూ కాకపోవటంతో సిఎంకు కాకపుట్టింది. అందుకనే ప్రాజెక్టు స్పిల్ వే పనులతో పాటు ప్రాజెక్టు ప్రగతిపై చంద్రబాబు ఈ రోజు పరిశీలించారు. ఆ సందర్భంగా ఉన్నతాధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. అప్పుడు అధికారులు మాట్లాడుతూ పోలవరం పనులు జరగకపోవటానికి ట్రాన్స్ టాయ్ సంస్ధ నిర్లక్ష్యమే కారణమని తెగేసి చెప్పారు. సంస్ధకు అసలు మానవవనరుల సామర్ధ్యమే లేదని తేల్చి చెప్పారు.

సబ్ కాంట్రాక్టర్లతోను, ఏజెన్సీలతో పనులు చేయిస్తున్నా వాటికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవటంతోనే అవి కూడా పనులు చేయటం లేదని గట్టిగా చెప్పారు. ఒకవిధంగా ట్రాన్స్ టాయ్ పై ఉన్నతాధికారులు కూడబలుక్కుని ఫిర్యాదులు గుప్పించారు. అక్కడే ఉన్న సంస్ధ ప్రతినిధిని నిలదీస్తే సరైన సమాధానం చెప్పలేదు. దాంతో చంద్రబాబుకు విషయం అర్ధమైంది. మొత్తానికి పోలవరం ప్రాజెక్టు పనులు చంద్రబాబు మెడకు చుట్టుకునేలానే కనబడుతోంది.