పెరుగుతున్న ప్రజాగ్రహాన్ని గమనించిన తర్వాత పాలకుల్లో ఆందోళన మొదలైంది.

పాలకుల తప్పులకు అధికారులే బలవుతారని మరోసారి రుజువవుతోంది. ప్రజాస్వామ్యంలో నిర్ణయాధికారం ఎప్పటికైనా పాలకుల చేతుల్లేనే ఉంటుంది. వాటిని అమలు చేయటమే అధికార యంత్రాంగం బాద్యత. అయితే, తాము తీసుకున్న నిర్ణయాలను ప్రజలు మెచ్చుకుంటే క్రెడిట్ ఎటూ పాలకులకే. రివర్స్ అయితే మాత్రం అధికారులు బలైపోతారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో ఇపుడు అదే జరుగుతున్నది.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పూర్తిగా ప్రధానమంత్రి నరేంద్రమోడిదే. రద్దు చేస్తే తలెత్తే పరిణామాలను అంచనా వేయటలో ఇటు పాలకులు, అటు ఉన్నతాధికారులు విఫలమయ్యారు. దాంతో యావత్ దేశం 12 రోజులుగా అతలాకుతలమైపోతోంది. దేశ ఆర్ధిక రంగం ఒక్కసారిగా కుదేలైంది. కరెన్సీ సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయేగానీ తగ్గటం లేదు. సమస్య పరిష్కారానికి కేంద్రం తీసుకుంటున్న ప్రతీ చర్యతోనూ సమస్యలు మరింత పెరుగిపోతుండటం గమనార్హం.

మొదట్లో సమస్యను పాలకులు, అధికార యంత్రాంగం చాలా తేలిగ్గా తీసుకున్నాయి. పెరుగుతున్న ప్రజాగ్రహాన్ని గమనించిన తర్వాత పాలకుల్లో ఆందోళన మొదలైంది. దాంతో ఇపుడు తీరిగ్గా దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. ఇందులో భాగంగానే నోట్ల రద్దు, ఎదురౌతున్న పరిణామాలు, కార్యాచరణ కోసం ప్రధాని 27 బృందాలను ఏర్పాటు చేసారు. ఈ బృందాలన్నీ క్షేత్రస్ధాయిలోని పరిస్ధితులను అధ్యయనం చేసి మోడికి నివేదికను సమర్పిస్తాయట. ఇటువంటి చర్యలనే ‘చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా’రని పెద్దలు చెబుతుంటారు.

ఇక, ప్రస్తుత విషయానికి వస్తే, రద్దు తర్వాత తలెత్తిన పరిస్ధితులకు అధికరులదే బాధ్యతగా ప్రధాని నిర్ణయించినట్లు సమాచారం. ప్రధానంగా రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ బాధ్యత చాలా ఉందట. ఎందుకంటే, ప్రధాని నిర్ణయానికి ఉర్జిత్ గుడ్డిగా ఓకే చెప్పారట. అంతేకాకుండా, ఏటిఎంల్లో రెండు రోజుల్లో డబ్బులు సర్దుబాటు చేస్తే సమస్య తగ్గిపోతుందని కూడా సలహా ఇచ్చారట. ఇదెంత వరకూ నిజమో తెలీదు గానీ సమస్య మొదలైనప్పటి నుండి జరుగుతున్న చర్చల్లో ఉర్జిత్ ను పూర్తిగా పక్కన బెట్టేసారట. ఏదైనా పనిచేయాలంటే నరేంద్రమోడి లాంటి వారు ఎవరిమాటైనా వింటారా ?

ఉర్జిత్ పై చర్యలు ఉండకపోవచ్చు. మరి, ఎవరిపై ప్రధాని చర్యలు తీసుకుంటారన్నదే ప్రశ్న. దాంతో క్రింది స్ధాయి అధికారుల్లో ఆందోళన మొదలైంది. ప్రధాని నియమించిన కమిటీలు తమ నివేదికలు అందించిన తర్వాత చర్యలు మొదలవ్వచ్చు. ఏదేమైనా ఈ విషయాలను గమనించిన తర్వాత అర్ధమవుతున్నదేమంటే, నిర్ణయాలెవరివైనా, అవి వికటించినపుడు చర్యలకు బలయ్యేది మాత్రం అధికారులేనని.