గున్న ఏనుగును కాపాడారు.. సెల్ఫీలు దిగారు.. చివరికి తల్లి ఏనుగు కోపానికి గురయ్యారు. అయితే ఈ ఘటనలో తనకేం సంబంధం లేని వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో ఈ ఘటన జరిగింది.

ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని సుర్లా– స్వర్ణాపురం తీరంలో తల్లి ఏనుగుదాడిలో ఒడిశాకు చెందిన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం కేశుపురం, బూర్జపాడు, లక్ష్మీపురం గ్రామ పరిసరాల్లో మూడురోజులుగా ఏనుగుల గుంపు సంచరిస్తోంది. ఈ గుంపు మంగళవారం ఒడిశా రాష్ట్రానికి చేరుకుంది. 

సుర్లా–స్వర్ణాపురం తీరంలో స్థానికంగా ఉన్న బాహుదానదిని ఏనుగుల గుంపు దాటుతుండగా ఓ చిన్న ఏనుగు గుమ్మిలో చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని స్థానిక యువకులు గమనించారు. ఆ ఏనుగును ఒడ్డుకు తీసుకొచ్చి సెల్ఫీలు దిగారు. అయితే పిల్ల ఏనుగును ఏదో చేస్తున్నారని భావించిన తల్లి ఏనుగు కోపానికి వచ్చింది. ఆగ్రహంతో వెనక్కి తిరిగి వచ్చింది. 

దీంతో ఆ యువకులు పరుగులు తీశారు. అదే సమయంలో నదిలో చేపలు పడుతున్న ఒడిశా యువకుడు ఏనుగు రాకను గమనించకపోవడంతో అక్కడే ఉండిపోయాడు. దీంతో ఏనుగు అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు.