చిత్తూరు: తన కుమారుడిని హైదరాబాదు నగరం నుంచి బహిష్కరించడంపై సినీ క్రిటిక్ మహేష్ కత్తి తండ్రి ఓబులేసు స్పందించారు. మహేష్ కత్తిని హైదరాబాదు నగరం నుంచి బహిష్కరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అవసరమైతే రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. 

తన కొడుకును కాదు, హిందువులను రెచ్చగొడుతున్న పరిపూర్ణానందకు దేశ బహిష్కరణ విధించాలని అన్నారు. మహేష్ దళితుడు కాబట్టే బ్రాహ్మణులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. 

రాముడి గురించి తన కొడుకు మాట్లాడింది నూటికి నూరు శాతం నిజమేనని అన్నారు. రామాయణం విష వృక్ష పుస్తకం.. పూర్తిగా చదివితే రాముడు ఎలాంటి వాడో అందరికీ అర్థమవుతోందని ఆయన అన్నారు. 

తన కుమారుడు నాస్తికుడు కాడని,  అస్తికుడేనని ఆయన తెలిపారు. తన కుమారుడు తన భార్యతో కలిసే ఉన్నాడని, విడిపోలేదని స్పష్టం చేశారు. ఈ నెల 4న లక్నో వెళ్లి కుమారుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారని తెలిపారు. 

సామాజిక మాధ్యమాల్లో కావాలనే కొంతమంది తన కొడుకుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని విమర్శించారు.