ఆయన ఇంకా టిడిపిలో చేరనేలేదు... కానీ ఎమ్మెల్యే టికెట్ ఖరారయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ ఎమ్మెల్యేనే ప్రకటించారు. తాను టిడిపి అభ్యర్థిగా నూజివీడు నుండి పోటీచేయనున్నట్లు పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ప్రకటించారు.
ఏలూరు : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు వైసిపి, ప్రతిపక్షం నుండి పవర్ లోకి వచ్చేందుకు టిడిపి-జనసేన కూటమి పక్కా వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలా అధికారికంగా పార్టీలో చేరకున్నా వైసిపి ఎమ్మెల్యే ఒకరికి టిడిపి సీటు ఖరారయ్యిందట. పసుపు కండువాతో ప్రజల్లోకి వచ్చిన ఆ ఎమ్మెల్యేనే స్వయంగా తన సీటు విషయాన్ని బయటపెట్టారు.
ఏలూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథికి ఈసారి వైసిపి టికెట్ నిరాకరించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న ఆయనను కాదని మంత్రి జోగి రమేష్ కు పెనమలూరు వైసిపి ఇంచార్జీ బాధ్యతలు అప్పగించారు. దీంతో తీవ్ర అసహనానికి గురయిన పార్థసారథి టిడిపిలో చేరేందుకు సిద్దమయ్యారు... కానీ ఇప్పటివరకు అతడు అధికారికంగా పసుపు కండువా కప్పుకోలేదు. ఇలా పార్టీలో చేరకపోయినా పార్థసారథికి టికెట్ ఖరారయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
తాజాగా ఎమ్మెల్యే పార్థసారథి టిడిపిలో చేరికపై, టికెట్ పై క్లారిటీ ఇచ్చారు. పార్టీలో చేరకుండానే టిడిపి అభ్యర్థిగా ఖరారుచేస్తారా అంటూ ఒకేమాటలో రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తాను నూజివీడు నుండి టిడిపి అభ్యర్థిగా పోటీచేయనున్నానని... టికెట్ కూడా ఖరారయ్యిందని పార్ఠసారథి ప్రకటించారు. అందువల్లే నూజివీడులో పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు.
వీడియో
మాజీ మంత్రి పార్ఠసారథి మొదటిసారి పసుపు కండువా వేసుకుని నూజివీడులో పర్యటించారు. ఈ టికెట్ ఖరారు కావడంతో నూజివీడు నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఆయన విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని మండల, గ్రామస్థాయి టిడిపి అధ్యక్షుల ఇళ్లకు స్వయంగా వెళుతున్న పార్ఠసారథి తనకు అండగా నిలవాలంటూ మద్దతు కోరుతున్నారు. పార్టీ అధిష్టానం కూడా పార్థసారథినే అభ్యర్థిగా ఖరారుచేసినట్లు ముఖ్య నాయకులంతా ఆయనవెంటే నిలుస్తున్నారు.
Also Read ముందు బిజెపి వదినమ్మ, వెనకాల కాంగ్రెస్ చెల్లెమ్మ...: చంద్రబాబుపై కొడాలి నాని సెటైర్లు
వైసిపిని దూరంపెట్టిన పార్థసారథి ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో తనకు పెనమలూరు టికెట్ ఇవ్వాలని ఆయనను కోరినట్లు పార్థసారథి తెలిపారు. కానీ నూజివీడులో అయితే తాను గెలుస్తానని పార్టీ భావించింది... అందువల్లే అక్కడ పోటీ చేయాలని సూచించిందన్నారు. గత నెలలోనే తనకు టీడీపీ టిక్కెట్ ఖరారైనట్లు పార్థసారథి వెల్లడించారు.
టిడిపి నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లను కోరినట్లు పార్థసారథి తెలిపారు. టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ బలోపేతానికి పనిచేస్తానని అన్నారు. ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చింది... ఈసారి టిడిపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. నూజివీడు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను ఎగురవేస్తామని పార్థసారథి వెల్లడించారు.
