విశాఖపట్నం: దళిత యువకుడి శిరోముండనం కేసులో అరెస్టయిన సినీ నిర్మాత నూతన్ నాయుడి లీలలు ఒక్కటొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఇద్దరు వ్యక్తులకు 12 కోట్ల రూపాయల మేరకు టోకరా వేసినట్లు తెలుస్తోంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. 

విశాఖపట్నం జిల్లా రావికమతం ప్రాంతానికి చెందిన నూకరాజు, తెలంగాణలోని చేవెళ్లకు చెందిన శ్రీకాంత్ రెడ్డి స్నేహితులు. నూకరాజు హైదరాబాదులో సీసీ కెమెరాల వ్యాపారం చేసేవాడు. శ్రీకాంత్ రెడ్డిది రియల్ ఎస్టేట్ వ్యాపారం. లావాదేవీల్లో భాగంగా వారికి నూతన్ నాయుడితో పరిచయం ఏర్పడింది. 

Also Read: నూతన్ నాయుడి చుట్టూ ఉచ్చు: విస్మయపరిచే మోసాల చిట్టా

వారికి దగ్గరైన నూతన్ నాయుడు ఎస్బీఐలో ఉద్యోగాలిస్తానని నమ్మించాడు. ఆ బ్యాంకులో దక్షిణ భారత రిజియన్ డైరెక్టర్ పోస్టు కోసం శ్రీకాంత్ రెడ్డి రూ.12 కోట్లు, ఉద్యోగం కోసం నూకరాజు రూ.5 లక్షలు నూతన్ నాయుడికి ఇ్చచారు. రెండేళ్లు గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. 

అంత భారీగా డబ్బులిచ్చే స్థాయి శ్రీకాంత్ రెడ్డికి ఉందా, లేదా అనే విషయంపై పోలీసులు ఆరా తీశారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. నూతన్ నాయుడికి సహకరించిన శశికాంత్ అనే వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. 

Also Read: నూతన్‌నాయుడి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు: మాజీ ఐఎఎస్ అధికారి పేరుతో ఫోన్లపై ఆరా