హైదరాబాద్: దివంగత ఎన్టీ రామారావుతో కలిసి జాతీయ రాజకీయాల్లో కరుణానిధి దక్షిణాది జెండాను ఎగురవేశారు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తూ, ఆయన సినీ రచయితగా సినీ రంగంలో కొనసాగుతున్నప్పుడు ఇరువురి మధ్య స్నేహం చిగురించింది. ఆ స్నేహం రాజకీయాల్లోనూ కొనసాగింది.

కేంద్ర పెత్తనంపై ఇరువురు కూడా తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించారు. రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కావాలంటూ వారిద్దరు గళమెత్తారు. కాంగ్రెసు ఆధిపత్యాన్ని ప్రశ్నించి, దాన్ని తుత్తునియలు చేయడానికి ఇరువురు కలిసి పనిచేశారు. కాంగ్రెసేతర పక్షాలను ఏకం చేయడంలో ఫలితం సాధించారు.

1987లో నేషనల్‌ ఫ్రంట్‌లోని భాగస్వామ్య పార్టీలతో భారీ బహిరంగ సభ చెన్నైలో జరిగింది. చెన్నైలో కాంగ్రెసేతర పక్షాల నాయకులందరూ పాల్గొన్నారు. ఆ తర్వాత భారీ ర్యాలీ నిర్వహించి మెరీనా బీచ్‌లో బహిరంగ సభ జరిపారు. నేషనల్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా ఇక్కడే ఎన్టీఆర్‌ను ఎన్నుకున్నారు. కోల్‌కతాలో అప్పటి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి జ్యోతి బసు చొరవతో జరిగిన రెండో ఫ్రంట్‌ బహిరంగ సభకు వారిద్దరు హాజరయ్యారు. 

తమిళనాడు అసెంబ్లీకి 1989 జనవరిలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కరుణానిధికి మద్దతుగా ఎన్టీఆర్ ప్రచారం చేశారు. కొన్ని రోజులపాటు తమిళనాడులోనే ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన అన్ని పనులు పక్కనపెట్టి కరుణానిధి కోసం రోజుల తరబడి ప్రచారం నిర్వహించారు. 

కన్యాకుమారి, తిరునల్వేలి, కోయంబత్తూరు, చెన్నై తదితర చోట్ల బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఆ ఎన్నికల్లో కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.