అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారిన సమీకరణాలతో ఎన్టీఆర్ బయోపిక్ చిక్కుల్లో పడింది. ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులో కలపడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారాయి. దీంతో ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ మహా నాయకుడు మూవీకి కష్టాలు వచ్చి పడ్డాయి. 

ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో కాంగ్రెసుది ప్రధానమైన విలన్ పాత్ర. సినిమా స్క్రిప్టు కూడా అందుకు అనుగుణంగానే రాసుకున్నారు. కాంగ్రెసును ఎదుర్కోవటానికి ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదంతో ఏం చేసారనే కోణంలోనే మహా నాయకుడు సినిమా యావత్తూ నడుస్తుంది. 

ఎన్టీఆర్ బయోపిక్ ను వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వాడుకునేందుకు తీస్తున్నారనేది అందరూ అనుకునే మాటనే. అందుకు అనుగుణంగానే స్క్రిప్టు సిద్ధం చేసుకున్నారు. అయితే, కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ దోస్తీ కట్టింది. దీనివల్ల సినిమాలో కాంగ్రెసును పార్టీని విమర్శించడం కుదరదు. 

అయితే, కాంగ్రెసుపై ఎన్టీఆర్ చేసిన పోరాటానికి సంబంధించిన దృశ్యాల చిత్రీకరణ యావత్తూ ఇప్పటికే ముగిసినట్లు చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఏం చేయాలో తోచక దర్శకుడు క్రిష్ తల పట్టుకున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, దీనికి మధ్యే మార్గంగా ఓ పరిష్కారం అనుకున్నారని, దానికి బాలయ్య సైతం సై అన్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. 

ఇంతకీ ఏమిటా పరిష్కారం అంటే... కాంగ్రెస్ అనే మాట ఉన్న చోటల్లా దాన్ని తీసేసి కేంద్రం అనే పదం వాడాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అది ఉభయతారకంగా ఉంటుందని భావిస్తున్నారని సమాచారం. దానివల్ల ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి తగిలే విధంగా ఉంటుందని, దానివల్ల రాజకీయ ప్రయోజనం కూడా నెరవేరుతుందని భావిస్తున్నారని అంటున్నారు.

 ఇక ఈ సినిమాలో విద్యా బాలన్ , రానా, సుమంత్ , కళ్యాణ్ రామ్ , నిత్యా మీనన్ , రకుల్ , తమన్నా , కైకాల సత్యనారాయణ , ప్రకాష్ రాజ్, నరేష్ పూనమ్ బజ్వా ,మంజిమా  మోహన్ , హిమన్షి  చౌదరి , భరత్ రెడ్డి  నటిస్తున్నారు.

మొదట అనుకున్న నిడివి కన్నా ఎక్కువ రావడంతో రెండు భాగాలుగా విడుదల చేస్తున్నామని బాలకృష్ణ ప్రకటించాడు . 2019 జనవరి 9 అన్న ఎన్టీఆర్ ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం (1983 జనవరి 9 ) చేసిన రోజున “ఎన్టీఆర్ మహా నటుడు” అనే సినిమా విడుదల అవుతుందని , జనవరి 24 న “ఎన్టీఆర్ మహా నాయకుడు ” అనే సినిమా విడుదల చేస్తారు.