ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు తలపై కొట్టి.. మెడకు టవల్ బిగించి హత్య చేశారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా పరవాడ మండలంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వాడచీపురుపల్లి పంచాయతీ పరిధి గొరుసువానిపాలెంకు చెందిన గొరుసు రామిరెడ్డి(30) ఐటీఐ పూర్తి చేసి సుమారు పదేళ్లుగా సింహాద్రి ఎన్టీపీసీ సీఅండ్ఐ విభాగంలో కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా రుణాలు ఇచ్చి వసూలు చేసే పని కూడా చేస్తుంటాడు.

ఇతనికి 2017లో వివాహం అయ్యింది. అతనికి రెండేళ్ల పాప హీక్షిత, ఎనిమిది నెలల కుమారుడు చేతన్ వెంకట్ ఉన్నారు. రామారెడ్డి అత్తింటివారు చాలా పేదింటివారు కావడంతో.. ప్రస్తుతం కొబ్బరి, అరిటిపళ్లు దుకాణం పెట్టుకొని కూర్మన్నపాలెంలో నివాసం ఉంటున్నారు.

ఇటీవల రామిరెడ్డి ఇద్దరు పిల్లలు అనారోగ్యానికి గురికావడంతో.. ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు వీలుగా ఉంటుందని.. భార్య, పిల్లలను అత్తింట్లో వదిలిపెట్టాడు. ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లి.. సాయంత్రానికి అతను కూడా అత్తింటికి చేరుకునేవాడు.

ఇలా పని ముగించుకొని అత్తారింటికి వెళుతండగా.. దారి కాచి మరీ రామిరెడ్డిని కొందరు వ్యక్తులు హత్య చేశారు. తలపై గట్టిగా కొట్టి... అనంతరం మెడకు టవల్ బిగించి అతి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.