Asianet News TeluguAsianet News Telugu

కాకినాడ బీచ్‌లో పల్లీలు అమ్మే వ్యక్తికి ఎన్నారై కుటుంబం బాకీ.. 12 ఏళ్ల తర్వాత ఏం ఇచ్చి రుణం తీర్చుకున్నదంటే?

2008లో కాకినాడా బీచ్‌లో పల్లీలు పెట్టిన వ్యక్తికి డబ్బులు ఇవ్వడం కుదరకపోయిన ఆ ఎన్నారై కుటుంబం ఇప్పుడు ఆయన ఆచూకీని వెతికి పట్టి కనుక్కుంది. అప్పుడు ఇవ్వాల్సిన రూ. 10కు బదులు రూ. 25వేలు ఇప్పుడు వారి చేతిలో పెట్టింది. పిల్లలతో సరదాగా బీచ్‌కు వెళ్లిన మోహన్ పర్సు వెంట తీసుకెళ్లలేదు. పల్లీలు పెట్టాక ఆ విషయం తెలిసింది. ఇప్పుడు ఆ పిల్లలే పెద్దలయ్యాక.. ఆ రుణం తీర్చుకోవడానికి మళ్లీ కాకినాడలో అడుగుపెట్టారు. దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి మూడేళ్ల క్రితమే ఆత్మహత్య చేసుకోవడంతో.. ఆయన భార్యకు ఆ డబ్బులు అందించారు.
 

NRI family cleared their debt to groundnut vendor after 12 years in andhra pradesh
Author
Kakinada, First Published Jan 15, 2022, 12:11 AM IST

అమరావతి: కొన్ని పరిచయాలు క్షణకాలంలో మెరిసినా.. జీవిత కాలం వెంటుంటాయి. కొన్ని విశ్వాసాలు.. కొన్ని హామీలు కూడా దీర్ఘకాలం మన వెంటే ఉంటాయి. ఆ విశ్వాసాలతో ఏర్పడ్డ జ్ఞాపకాలు.. కాలంతోపాటు బరువెక్కుతాయి. ఇచ్చిన హామీలూ తీర్చాల్సిందిగా పదే పదే గుర్తుకు వస్తుంటాయి. మళ్లీ కలుసుకోలేనంత దూరం వెళ్లినా.. దేశమే దాటి వెళ్లిపోయినా.. మనసులోని పల్లీలు(Nuts) అమ్మే వ్యక్తి(Vendor)కి బాకీ పడ్డ రుణం మాత్రం ఆ ఎన్నారై కుటుంబం(NRI Family) మరువలేదు. 12 ఏళ్లుగా వెతికి వెతికి.. చివరకు పట్టుకుని ఆ కుటుంబాన్ని పరామర్శించి రుణం(Debt) చెల్లించి ఉల్లాస పడింది. కాకినాడ బీచ్‌(Kaninada Beach)లో పల్లీలు అమ్మే వ్యక్తి కోసం 12 ఏళ్లుగా వెతికి.. రూ. 10 బాకీని తీర్చుకుంది.

మోహన్ నేమాని అనే తెలుగు కుటుంబం అమెరికాలో స్థిరపడింది. 2008కి ముందు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉండేది. అప్పుడు ఓ సారి మోహన్ నేమాని సరదాగా పిల్లతో కలిసి బీచ్‌కు వెళ్లాడు. అప్పుడు అక్కడ పెద్ద సత్తయ్య వేరు శెనగలు అమ్ముతున్నాడు. పిల్లలు ఆయన దగ్గర పల్లీలు తీసుకోవాల్సిందిగా తండ్రిని కోరారు. ఆయన సత్తయ్యను రమ్మని పల్లీలు పెట్టమని అడిగాడు. పెద్ద  సత్తయ్య.. మోహన్ నేమని కుటుంబానికి రూ. 10 విలువైన వేరు శెనగలు ఇచ్చాడు. కానీ, జేబులో చేయి పెట్టగా పర్సు తేలేదని మోహన్‌కు అర్థమైంది. బీచ్‌కు స్నానం చేయడానికి రావడంతో.. పర్సు ఇంటి వద్దే ఉంచివచ్చాడని గుర్తు చేసుకున్నాడు. ఇదే విషయాన్ని పెద్ద సత్తయ్యకు వివరించాడు. దానికి పెద్ద సత్తయ్య సానుకూలంగా స్పందించాడు. ఆ పిల్లలూ తన పిల్లల వంటి వారేనని, డబ్బులు మళ్లీ వచ్చినప్పుడు ఇవ్వండి అంటూ అక్కడి నుంచి కదిలాడు. మోహన్ కొడుకు.. ఆ పెద్ద సత్తయ్యతో ఓ ఫొటో కూడా దిగాడు.

కానీ, మోహన్ నేమాని కుటుంబం.. మళ్లీ ఆ పెద్ద సత్తయ్యను కలువలేదు. వారు ఆ తర్వాత దేశం దాటి అమెరికాలో సెటిల్ అయ్యారు. కానీ, మోహన్ నేమాని పిల్లల మనసులో మాత్రం పెద్ద సత్తయ్యకు బాకీ పడ్డ సంగతి ఎప్పుడూ మదిలోనే మెదులుతుండేది. ఎలాగైనా.. పెద్ద సత్తయ్యకు డబ్బులు ఇవ్వాలనే కాంక్ష వయసుతోపాటు పెరిగి పెద్దయింది. 12 ఏళ్లుగా పెద్ద సత్తయ్య కోసం వారు వెతుకుతూ వస్తున్నారు. కానీ, ఆయన వివరాలు కనుక్కోలేకపోయారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫేస్‌బుక్ పేజీలో ఈ విషయాన్ని పోస్టు చేయడంతో వారి చిరునామాను కనుక్కోగలిగారు.  

తీరా వారిని కలుసుకోవడానికి వెళ్లగా ఓ చేదు వార్త ఎదురైంది. తమకు పల్లీలు పెట్టిన ఆ పెద్ద సత్తయ్య అప్పటికే మరణించాడని తెలిసింది. అయినా.. సరే ఆయన భార్య గంగమ్మ, వారి పిల్లలను కలుసుకోవాలని, వారికి అయినా ఆ బాకీ కట్టేయాలని మోహన్ పిల్లలు భావించారు. ఆ కుటుంబాన్ని కలుసుకుని రూ. 10కి బదులుగా రూ. 25 వేలు వారి చేతిలో పెట్టారు.

పెద్ద సత్తయ్య కుటుంబం ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా యూ కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో నివసిస్తున్నది. పెద్ద సత్తయ్య బీచ్‌లో పళ్లు, పల్లీలు అమ్మి తమను పోషించాడని గంగమ్మ తెలిపింది. కానీ, మూడేళ్ల క్రితం పెద్ద సత్తయ్య ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. ఇప్పుడు కష్టపడితేనే.. తినడానికి తిండి పరిస్థితిలో తాము ఉన్నామని వివరించింది. 12 ఏళ్ల క్రితం తన భర్త పెట్టిన పల్లీలను జ్ఞాపకం ఉంచుకుని వెతికి వచ్చి రూ. 25వేల తమ కుటుంబానికి ఇవ్వడం తమలో సంతోషాన్ని నింపిందని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios