విశాఖపట్టణం: నగ్నంగా దొంగతనాలకు పాల్పడే ఓ వ్యక్తిని విశాఖపట్టణం పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటిపై నూలుు పోగులు లేకుండా చోరీలు చేయడం అతని ప్రత్యేకత. ఈ రకంగా సుమారు 60 ఇళ్లలో నిందితుడు చోరీకి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు.

ఈ ఏడాది జూలై మాసంలో విశాఖపట్టణంలోని పలు ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డాడు. మరో వైపు ఇదే నెల 8వ తేదీన కూడ విశాఖలోని పలు ఇళ్లలో చోరీకి యత్నించాడు. 

గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన కంచర్ల మోహన్ రావు నగ్నంగా ఇళ్లలోకి దూరి చోరీలకు పాల్పడుతున్నాడని పోలీసులు గుర్తించారు. అతనిని అరెస్ట్ చేసినట్టుగా విశాఖపట్టణం డీసీపీ ఐశ్వర్య రస్తోగీ ప్రకటించారు.మోహన్ రావుకు అనకాపల్లి మండలం తమ్మయ్యపేట వెంకుపాలెం కు చెందిన సంతోష్ కుమార్ సహకరిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

మోహన్ రావును సంతోష్ కుమార్ తన బైక్ పై దొంగతనం చేసే ఇంటి వద్ద దించుతాడు. దొంగతనానికి ఎంచుకొన్న ఇంటి వద్ద మోహన్ రావు బట్టలు విప్పేస్తాడు.  నగ్నంగా ఇంట్లోకి ప్రవేశిస్తాడు.

కొన్ని సమయాల్లో అండర్ వేర్ మాత్రమే ధరిస్తాడు.  చేతులకు మాత్రం గ్లౌజులు ధరిస్తాడు.  ఎవరైనా అతనిని చూస్తే మానసిక రోగిగా భావించి వదిలేస్తాడని భావంచి ఈ రకంగా బట్టల్లేకుండా దొంగతనాలకు పాల్పడుతాడని పోలీసులు ప్రకటించారు. 

చోరీకి పాల్పడిన బంగారాన్ని నిందితుడు  అనకాపల్లిలోని ఓ ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెట్టాడు. ఈ సంస్థలో 20 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.వేలి ముద్రలు పడకుండా ఉండేందుకు గ్లౌజులు ధరిస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 

చోరీ చేసే సమయంలో ఎవరైనా చూస్తే సైకోగా భావించి అతనిని చూసి భయపడే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. ఈ సమయాన్ని అవకాశంగా తీసుకొని నిందితుడు తప్పించుకొంటున్నాడని పోలీసులు చెప్పారు.