అమరావతి:ఏపీ రాష్ట్రంలో స్కూల్స్ పున: ప్రారంభించిన తర్వాత 262 మంది విద్యార్ధులు, 160 మంది టీచర్లు కరోనా బారినపడ్డారు. నవంబర్ రెండో తేదిన రాష్ట్రంలో స్కూల్స్ ఓపెన్ చేశారు. 9, 10వ తరగతి విద్యార్ధులకు మాత్రమే ప్రస్తుతం పాఠశాలలకు వెళ్తున్నారు.

కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకొంటూనే పాఠశాలలను నడుపుతున్నామని విద్యాశాఖాధికారులు ప్రకటించారు. స్కూళ్లకు హాజరైన విద్యార్ధుల, టీచర్లతో పోల్చుకొంటూ కరోనా సోకిన విద్యార్ధులు, టీచర్ల సంఖ్య తక్కువగానే ఉందని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ వి చినవీరభద్రుడు తెలిపారు.

స్కూల్స్ తెరిచిన తర్వాత నమోదైన కరోనా కేసుల విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

నవంబర్ 4వ తేదీన రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో సుమారు 4 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారని ఆయన చెప్పారు.అయితే స్కూల్స్ కు హాజరైన 4 లక్షల మందిలో కేవలం 262 మందికి మాత్రమే కరోనా సోకిందన్నారు. అంటే కనీసం 0.1 శాతం కూడ కాదన్నారు.

పాఠశాలలకు హాజరు కావడం వల్లే వారు ప్రభావితమయ్యారని చెప్పడం సరైందికాదన్నారు. ప్రతి పాఠశాల గదిలో 15 లేదా 16 మంది విద్యార్ధులు మాత్రమే ఉన్నారని నిర్ధారిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో 9 , 10 తరగులకు 9.75 లక్షల మంది విద్యార్ధులు నమోదయ్యారు. వీరిలో 3.93 లక్షల మంది విద్యార్ధులు స్కూళ్లకు హాజరయ్యారు. 1.11 లక్షల మంది ఉపాధ్యాయులలో 99 వేల మంది విద్యాసంస్థలకు బుధవారం నాడు హాజరయ్యారు.

1.11 లక్షల మంది టీచర్లలో 160 మంది టీచర్లకు కరోనా సోకిందని చినవీరభద్రుడు తెలిపారు. టీచర్లు, విద్యార్ధుల ప్రాణాలు కూడ తమకు ముఖ్యమేనని ఆయన చెప్పారు.

పాఠశాలలు తిరిగి ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో 40 శాతం మంది విద్యార్ధులు మాత్రమే స్కూళ్లకు వస్తున్నారు.కరోనా గురించి విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉన్న భయం కారణంగా ఈ నిర్ణయం తీసుకొంటున్నారు.

పాఠశాలలు తెరవకపోతే ఆన్ లైన్ తరగతులు పేదలకు భారంగా ఉన్నాయని దీంతో విద్యార్ధులు ఎక్కువగా ప్రభావితమౌతారని ఆయన చెప్పారు. యువకులు పాఠశాలలకు వెళ్లడం మానేస్తే గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లోని బాలిక విద్యార్ధులకు ఇబ్బందికరంగా ఉంటుందని ఆయన తెలిపారు.

9, 10 తరగతి విద్యార్ధులతో పాటు ఇంటర్ ఫస్టియర్,సెకండియర్ విద్యార్ధులకు రోజు విడిచి క్లాసులు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ తో మార్చి నుండి రాష్ట్రంలో విద్యా సంస్థలు మూసివేశారు.