ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నికల అధికారి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఎన్నికలపై ప్రభుత్వం వ్యతిరేకత చూపిస్తోంది. సుప్రీం కోర్టు కి కూడా ఎక్కింది.

కాగా.. ఎన్నికల అధికారి చెప్పిన వివరాల ప్రకారం నేడు నామినేషన్ల ప్రక్రియ మొదలుకావాల్సి ఉంది. ఈ క్రమంలో.. ఓ వ్యక్తి నామినేషన్ వేయడానికి రాగా.. ఆ అభ్యర్థిని అధికారులు వెనక్కి పంపించేశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. హిందూపురం మండలం తూముకుంట ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన షమీన్ తాజ్ అనే అభ్యర్థిని నామినేషన్ వేయడానికి వస్తే.. వేయకుండానే వెనక్కి పంపించేశారు. నామినేషన్ పత్రాలు ఇంకా  రాలేదని అభ్యర్థికి కార్యాలయం అధికారులు తెలిపారు.

మరోవైపు గుంటూరులో పంచాయతీ ఎన్నికల కోసం అధికారులు హడావిడి లేకుండా నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లు చేశారు. నామినేషన్ పత్రాలు పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో నామినేషన్లు తీసుకునేందుకు అధికారులు బాధ్యతలు కేటాయించారు.