Asianet News TeluguAsianet News Telugu

అప్పటివరకు... పోలీస్ శాఖలో బదిలీలుండవు: డిజిపి కీలక ఆదేశాలు

పోలీసు శాఖలోని అన్ని విభాగాల్లోనూ బదిలీలు ఆపేయాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాలు జారీ చేశారు.

No transfer of police personnel after new districts farmation: AP DGP
Author
Amravati, First Published Nov 12, 2020, 12:11 PM IST

అమరావతి: పోలీసు శాఖలోని అన్ని విభాగాల్లోనూ బదిలీలు ఆపేయాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న తరుణంలో కానిస్టేబుల్‌ నుంచి పైస్థాయి అధికారి వరకూ ఏ ఒక్కరినీ బదిలీ చేయవద్దని స్పష్టంగా నిర్దేశించారు. జనరల్‌ రైల్వే పోలీస్‌, సీఐడీ, ఇంటెలిజెన్స్‌, స్పెషల్ బ్రాంచ్, ఏపీఎస్పీతో పాటు శాంతిభద్రతల విభాగాలైన రేంజ్‌లు ఎస్పీల పరిధిలో తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ రంగం సిద్దం చేసిన విషయం తెలిసిందే. గత కేబినెట్ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం సీఎస్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు అధికారిక జీవో కూడా వెలువడింది. అయితే ఈ జీవోలో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

ఇదివరకు నిర్ణయించినట్లుగా రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 25 కు బదులు 26 కు పెంచే ఆలోచనలో ప్రభుత్వం వుంది. ఈ మేరకు గతంలో విడుదల చేసిన జిల్లాల పెంపు కమిటీ జీవో లో మార్పులు చేసింది. 25 లేదా 26 జిల్లాల పెంపుపై కమిటీ అధ్యయనం చేస్తుందంటూ ఉత్తర్వులు జారీ చేసింది. 

 గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసిపి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

కొత్త జిల్లాల ఏర్పాటు కోసం అధ్యయన కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని ఛైర్మెన్ గా ఉంటారు. ఈ కమిటీలో సభ్యులుగా సీసీఎల్ఏ, జీఏడీ సర్వీసెస్ సెక్రటరీ, ప్రణాళిక శాఖ కార్యదర్శి, కమిటీ కన్వీనర్ గా ఫైనాన్స్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. మూడు మాసాల్లో ఈ కమిటీ  నివేదికను ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. 

పార్లమెంట్ నియోజకవర్గాలను కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే కొన్ని జిల్లాల ఏర్పాటు విషయంలో అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల నుండే నిరసన గళాలు వచ్చాయి. అయితే ఏ రకంగా జిల్లాలను ఏర్పాటు చేయాలనే దానిపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
 

 

Follow Us:
Download App:
  • android
  • ios