Asianet News TeluguAsianet News Telugu

తెలుగు ప్రజలకు సేవ చేయకుండా భూమిపై నన్ను ఏ శక్తీ ఆపలేదు - చంద్రబాబు నాయుడు

తెలుగు ప్రజలకు సేవ చేయకుండా తనను శక్తీ అడ్డుకోలేదని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అరెస్టు అనంతరం ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో పెట్టిన పోస్టుల్లో.. తనకు తెలుగు ప్రజల బాగు గురించి ఆలోచించడం తప్ప మరో ధ్యాస ఉండని చెప్పారు. అందుకే ఈ బెదిరింపులు, అరెస్టులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 

No power on earth can stop me from serving Telugu people - Chandrababu Naidu..ISR
Author
First Published Sep 9, 2023, 1:08 PM IST

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. నంద్యాల పట్టణంలోని జ్ఞానాపురంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నంద్యాలలో హైడ్రామా నెలకొంది. ఆయన అరెస్టు కోసం సీఐడీ అధికారులు రాత్రికి 2.30 గంటలకు ఫంక్షల్ హాల్ వద్దకు చేరుకున్నప్పటికీ.. ఉదయం 6 గంటలకు అరెస్టు చేశారు.

కాగా.. తెలుగు ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని, తనను ఏ శక్తీ అడ్డుకోలేదని చంద్రబాబు నాయుడు అన్నారు. అరెస్టు అనంతరం ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ లో పోస్టు పెట్టారు. గత 45 ఏళ్లుగా తెలుగు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్నానని తెలిపారు. తెలుగు ప్రజలకు, నా ఆంధ్రప్రదేశ్ కు, నా మాతృభూమికి సేవ చేయకుండా భూమ్మీద ఏ శక్తీ అడ్డుకోలేదని పేర్కొన్నారు. తన అరెస్టుపై ప్రజలు, పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అంతిమంగా సత్యం, ధర్మం గెలుస్తాయని పేర్కొన్నారు. వారు నాకు ఏం చేసినా ప్రజల కోసం ముందుకెళ్తానని తెలిపారు.

మరో పోస్టులో ‘‘45 ఏళ్ళ నా రాజకీయ జీవితం మీద మచ్చ వేయడానికి ఎన్నో కుట్రలు జరిగాయి. కానీ ఎవరివల్లా కాలేదు. ఎందుకంటే నిప్పులా బతికా. తెలుగు ప్రజల బాగు గురించి ఆలోచించడం తప్ప, నాకు మరొక ధ్యాస ఉండదు. ప్రజల గురించి పోరాడుతున్నా కాబట్టే ఈ రోజు ఈ బెదిరింపులు...అక్రమ అరెస్టులు. ఇవి ఏవీ నన్ను, నా ప్రజల నుండి  వేరుచేయలేవు. ప్రభుత్వ అక్రమాలపై నా పోరాటాన్ని ఆపలేవు. అంతిమంగా గెలిచేది ప్రజాస్వామ్యమే....అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే. భయపడే..రాజీ పడే ప్రసక్తే లేదు’’ అని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios