అమరావతి:పోలవరం ప్రాజెక్టు ఎత్తును ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గించబోమని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.బుధవారం నాడు ఏపీ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ ప్రసంగించారు.  ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని  ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులోనే నిర్మిస్తామని ఆయన తేల్చి చెప్పారు.  ఎత్తు విషయంలో ఎలాంటి రాజీలేదన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన కొత్త అంచనాలు జల్ శక్తి అంచనాల ద్వారా కేంద్ర కేబినెట్ కే వస్తాయని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తోందని ఆయన చెప్పారు.

also read:ఎక్కడుంటే అక్కడ దిగజారిన రాజకీయం:చంద్రబాబుపై జగన్ ఘాటు వ్యాఖ్యలు

పోలవరం నిర్మాణంలో నిరాశ్రయులను ఆదుకోవడంతో పాటు పునరావాసం కల్పించే విషయమై చర్యలు తీసుకొంటామన్నారు. ఏ ఎత్తులో ప్రాజెక్టును నిర్మిస్తే ఎంత మేరకు పునరావసం, పరిహారం చెల్లింపు విషయమై ఖర్చుల గురించి తమ ప్రభుత్వం అంచనాలను తయారు చేసిందన్నారు. ఈ మేరకు ఏ ఎత్తులో ప్రాజెక్టు నిర్మాణం చేపడితే  ఏ మేరకు ఖర్చు అవుతోందనే విషయమై సీఎం లెక్కలతో సహా వివరించారు.

పోలవరం ప్రాజెక్టు వద్ద 100 అడుగుల వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టును ప్రజలకు చూపించే పేరుతో రూ. 83.కోట్ల 45 లక్షలను వృధాగా ఖర్చు చేశారని ఆయన విమర్శించారు.

ప్రజలను పోలవరం వద్దకు తీసుకెళ్లి చంద్రబాబునాయుడు భజన చేయించారన్నారు. గతంలో పోలవరం వద్ద చంద్రబాబును పొగుడుతూ పాడిన ఓ పాట వీడియోను అసెంబ్లీలో జగన్ ప్రదర్శించారు.తమ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో ఒక్క పైసా కూడ వృధా చేయదని ఆయన చెప్పారు.