చూడబోతే ఏపి ప్రభుత్వం భర్తీ చేయబోయే ఉద్యోగాలకు అవుట్ సోర్సింగ్ విధానమే గతిలాగ కనబడుతోంది. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో టిడిపి ఇచ్చిన అనేక వాగ్దానాల్లో ‘జాబు రావాలంటే బాబు రావాలి’ అనే నినాదం కూడా కీలకమైంది. అటువంటి హామీని చంద్రబాబు అధికారంలోకి రాగానే పక్కన పెట్టేసారు. సరే, కొంతకాలం తర్వాత ఐటి కంపెనీలు వచ్చేస్తున్నాయని, లక్షాలాది ఉద్యోగాలు ఖాయమని చాలానే చెప్పారు.

రాష్ట్రానికి వస్తున్న ఐటి కంపెనీలన్నీ విశాఖపట్నంవైపే చూస్తున్నాయంటూ పెద్ద మాటలు చాలానే చెప్పారు. కానీ హుద్ హుద్ తుఫాను దెబ్బకు చంద్రబాబు మాటలు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. హుద్ హుద్ వచ్చి సుమారు రెండు సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటి వరకూ చెప్పుకోతగ్గ ఐటి కంపెనీ ఒక్కటీ రాలేదు. చంద్రబాబుతో పాటు  ఐటి, పంచాయితీ రాజ్ శాఖల మంత్రి అయిన నారా లోకేష్ ఉద్యోగాల విషయంలో మాటలతో పెద్ద కోటలే కట్టారు.

ఐటి కంపెనీలు వస్తే 5 లక్షల ఉద్యోగాలని ఒకసారి, 2 లక్షల ఉద్యోగాలని ఇంకోసారి, ఏడాదికి లక్ష ఉద్యోగాలని మరోసారి..ఇలా చాలా సార్లు చాలా ప్రకటనలే చేసారు. అయితే, అవేవీ జరిగే సూచనలు కనబడటం లేదు. ఎందుకంటే, ఒక్క పెద్ద ఐటి కంపెనీ కూడా విశాఖపట్నం కాదు కదా అమరావతి వైపు కూడా చూడలేదు. తాజాగా లోకేష్ చెప్పిన మాటల ప్రకారమే విశాఖపట్నంలో ఐటి కంపెనీలు పెట్టటానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదట.

బెంగుళూరు, హైదరాబాద్ లో ఉన్న సౌకర్యాలేవీ విశాఖపట్నంలో లేవు కాబట్టి ఐటి కంపెనీలు ఆసక్తి చూపటం లేదట. అంటే ఇంతకాలం చెప్పిన లక్షలాది ఉద్యోగాలన్నీ నీటిమీద రాసిన మాటలే అని అర్దమైపోయింది. అందుకనే, పంచాయితీ రాజ్ శాఖలో పంచాయితీ కార్యదర్శులుగా 5 వేలమంది కార్యదర్శులను నియమించాలని మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది. ఆ ఉద్యోగాలు కూడా అవుట్ సోర్సింగ్ పద్దతిలోనే అట. ఇతర శాఖల్లోని ఉద్యోగాల భర్తీ సంగతి దేవుడికే తెలియాలి. ఇటు పంచాయితీరాజ్, అటు ఐటి శాఖలు రెండు కూడా లోకేష్ చేతిలోనే ఉన్నాయి. ఇప్పటి వరకూ చెప్పినట్లు ఐటిలో లక్షలాది ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవని తేలిపోవటంతో ఐటిని వదిలిపెట్టి పంచాయితీ రాజ్ శాఖలో 5 వేల ఉద్యోగాలంటున్నారు.