అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. ఐదేళ్ల క్రితం 90 వేల కోట్ల అప్పులతో ఏపీ రాష్ట్రం  ఆవిర్భవించింది. ఐదేళ్ల తర్వాత ఏపీ ఖజానా మరింత దిగజారినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో ఆదాయ పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ ఇటీవల అధికారులతో  సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో గణాంకాలు షాక్  కు గురిచేస్తున్నాయి.ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరంలో  14 శాతం వాణిజ్య పన్నుల వాటా పెరిగే అవకాశం ఉందని భావించారు.కానీ, వాణిజ్య పన్నుల వాటా పెరుగుదల కేవలం 5.3 శాతంగా నమోదైంది.

నిర్మాణ రంగంలో భారీగా నిలిచిపోవడంతో ఆదాయ వనరులు భారీగా పడిపోయినట్టుగా ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇనుము, ఉక్కు, సిమెంట్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో రాష్ట్ర ఖజానాపై పడిందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నారు.

ఆటోమొబైల్ అమ్మకాలు పడిపోయాయి. ఇది అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే జీఎస్టీపై  ప్రభావం చూపుతోంది. కేంద్రం నుండి జీఎస్టీలో రాష్ట్ర వాటా కేవలం రూ. 597 కోట్లుగా ఉంటుందని అంచనా.

రానున్న రోజుల్లో వాణిజ్య పన్ను ఆదాయంలో 14 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా.  ఆటోమొబైల్ ,ఇతర రంగాల నుండి ఆదాయం ఈ ఏడాది చివరి నాటికి మెరుగయ్యే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎన్నికల ముందు నవరత్నాలను జగన్ ప్రచారం చేశారు. నవరత్నాలకు బడ్జెట్ లో పెద్దపీట వేసింది జగన్ సర్కార్.అయితే  జగన్ సర్కార్ అమలు చేయాలనుకొన్నా నవరత్నాలకు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయనే విషయమై ప్రస్తుతం చర్చకు దారి తీస్తోంది.

నవరత్నాలు అమలు చేయాలంటే భారీగానే నిధులు అవసరమౌతాయి. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు,సంక్షేమ పథకాలను కొనసాగించాలంటే ఖజానా నిండా డబ్బులు ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టినా కూడ ఆర్ధిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. 

కేంద్రం దయతలచి నిధులు ఇవ్వాలి. లేదా రాష్ట్ర ప్రభుత్వం అప్పులకు వెళ్లాలి. అయితే ఎప్ఆర్‌బీఎం పరిమితికి లోబడే అప్పులు తెచ్చుకోవాలి. గత ఐదేళ్లలో చంద్రబాబు సర్కార్ ఎడాపెడా అప్పులు చేసిందని వైఎస్ఆర్‌సీపీ ఆరోపణలు చేసింది. 

అయితే అప్పులు చేసేందుకైనా తమకు అవకాశం ఉంటుందా అనే చర్చ కూడ మంత్రుల్లో వ్యక్తమౌతోంది.రాష్ట్ర ఖజనాను నింపేందుకు జగన్ సర్కార్ ఏ రకమైన చర్యలు తీసుకొంటారో చూడాలి.