కోగంటి సత్యం లాంటి నేరస్తులను నగర బహిష్కరణ చేయాలి: విజయవాడ సీపీ బత్తిన
విజయవాడలో శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేదని సీపీ బత్తిన శ్రీనివాసులు చెప్పారు. కోరాడ విజయ్ కుమార్, రాహుల్ మధ్య వివాదం ముందుగానే తమకు తెలియదని ఆయన చెప్పారు. తనను హత్య చేస్తారని రాహుల్ ఊహించలేదన్నారు.
విజయవాడ: విజయవాడలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని సీపీ బత్తిన శ్రీనివాసులు చెప్పారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో శాంతిభద్రతలకు ఇబ్బంది లేదని ఆయన తేల్చి చెప్పారు.మంగళవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. పారిశ్రామికవేత్త రాహుల్, కోరాడ విజయ్ కుమార్ మధ్య వివాదం గురించి ముందుగానే తమకు తెలియదన్నారు. దాడి తర్వాత తనను చంపుతారని రాహుల్ ఊహించలేదని సీపీ వివరించారు.
రాహుల్ హత్య కేసులో నిందితురాలు గాయత్రిని అరెస్ట్ చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. కోగంటి సత్యం లాంటి నేరస్తులను నగర బహిష్కరణ చేయాల్సి ఉందని ఆయన చెప్పారు.విజయవాడలో పండు ఘటన తర్వాత ఘర్షణలు లేని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నగరంలో రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేశామన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన 30 శాతం సీసీ కెమెరాలు పనిచేయడం లేదని ఆయన ఒప్పుకొన్నారు.ఈ నెల 19వ తేదీన పార్కింగ్ చేసిన కారులో వ్యాపారవేత్త కరణం రాహుల్ అనుమానాస్పదంగా మరణించాడు. రాహుల్ ను హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించుకొని కేసును దర్యాప్తు చేశారు.ఈ కేసులో 11 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు.