తాను కాంగ్రెస్ వాదినేనని  మాజీ మంత్రి  శైలజానాథ్  చెప్పారు.  మాజీ ఎమ్మెల్యేల విషయంలో   సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్‌తో తాను ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిసినట్టు శైలజనాథ్ చెప్పారు. 

న్యూఢిల్లీ: తాను కాంగ్రెస్ వాదినేనని మాజీ మంత్రి శైలజానాథ్ చెప్పారు. మాజీ ఎమ్మెల్యేల విషయంలో సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్‌తో తాను ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిసినట్టు శైలజనాథ్ చెప్పారు.

బుధవారం నాడు అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో శైలజానాథ్ సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లపై సీఎంతో చర్చించానని తెలిపారు. ఎన్టీఆర్‌ వైద్యసేవా పథకం హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో అమలు కావడంలేదని సీఎం దృష్టికి తీసుకొచ్చానని శైలజానాథ్‌ చెప్పారు.

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తాను సీఎంతో చర్చించినట్టు చెప్పారు. తాను కాంగ్రెస్ వాదినేనని ఆయన ప్రకటించారు. అయితే గత ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి శైలజానాథ్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు.

ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేప్రసక్తే లేదన్నారు శైలజనాథ్. 2019 ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీ తరపున మాత్రమే పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. రాజకీయ అంశాలు చంద్రబాబుతో తాను చర్చించలేదని ఆయన ప్రకటించారు.

అయితే మాజీ మంత్రి శమంతకమణి కూతురు యామిని బాలకు టీడీపీ టిక్కెట్టు ఇచ్చింది. అనంతపురం జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత శైలజానాథ్‌ను టీడీపీలోకి రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నాన్ని శమంతకమణి తీవ్రంగా అడ్డుకొన్నారు. చివరి నిమిషంలో యామిని బాలకు చంద్రబాబు టిక్కెట్టు ఇచ్చారు. 

కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో శైలజనాథ్ చురకుగానే ఉంటున్నారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబునాయుడును బుధవారం నాడు కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.