అనంతపురం: మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌తో తనకు ఎలాంటి వైరం లేదని అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి తనయుడు జెసి వపన్ కుమార్ రెడ్డి చెప్పారు. జిల్లాలో రాజకీయ ఆధిపత్యం కోసం తామిద్దరం చక్రం తిప్పుతున్నామనే విషయంలో వాస్తవం లేదన్నారు.  పరిటాల రవి హత్యకు తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.  ఫ్యాక్షన్ రాజకీయాలను, హత్యలకు తమ కుటుంబం ఏనాడూ ప్రోత్సహించలేదని ఆయన చెప్పారు.

ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  పలు విషయాలపై  జెసి పవన్‌కుమార్ రెడ్డి ఆసక్తికర  వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను  క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్టు  చెప్పారు. అభివృద్ధి రాజకీయాలను మాత్రమే తమ కుటుంబం ప్రోత్సహిస్తోందని ఆయన చెప్పారు. హత్యలు, ఫ్యాక్షన్ రాజకీయాలకు తమ కుటుంబం దూరంగా ఉంటుందని ఆయన గుర్తు చేశారు.

తాము ఏనాడు కూడ హత్యా రాజకీయాలను, ఫ్యాక్షన్‌ రాజకీయాలను ప్రోత్సహించలేదని ఆయన చెప్పారు. ఆ అవసరమే తమకు లేదన్నారు. జిల్లాలో ఎక్కడ చేయని అభివృద్ధిని తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో తమ కుటుంబం చేసిందని ఆయన చెప్పారు. అభివృద్ధిని చూపి ఓట్లు అడిగే సంస్కృతి తమ కుటుంబానికి ఉందని ఆయన చెప్పారు. 

మాజీ మంత్రి పరిటాల రవి కుటుంబానికి తమ కుటుంబానికి ఎలాంటి విబేధాలు లేవన్నారు. పరిటాల రవి హత్యతో తమ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని ఆ కుటుంబం భావించి ఉండవచ్చన్నారు. కానీ, ఆ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన గుర్తు చేశారు. పరిటాల రవి హత్యతో సంబంధం ఉంటే తమ కుటుంబాన్ని టిడిపిలోకి ఎందుకు ఆహ్వానిస్తారని జెసి వపన్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

తాడిపత్రి నియోజకవర్గంలో తమ ప్రత్యర్ధిగా ఉన్న సూర్యప్రతాప్ రెడ్డి హత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ హత్య కేసులో  తన పేరును ప్రత్యర్ధులు ఏ1గా చేర్చారని ఆయన గుర్తు చేశారు. 

ఆ హత్య జరిగిన సమయంలో తాను  అసదుద్దీన్‌తో కలిసి సినిమా చూస్తున్నానని ఆయన ప్రస్తావించారు. మరోవైపు పోలీసుల విచారణలో కూడ అదే విషయం తేలిందన్నారు.ఎవరిపైనైనా దాడులు చేయాలని తమ అనుచరులు ప్లాన్ చేసిన విషయం తమకు తెలిస్తే  వాటిని ఆపిన విషయాన్ని గుర్తు చేశారు. 

జగన్‌‌కు తనకు  చిన్నతనం  నుండే స్నేహం ఉందని ఆయన చెప్పారు. అయితే వైఎస్ రాజారెడ్డి నుండి తమ కుటుంబంతో వైరం పెరిగిన క్రమంలో జగన్ ‌తో సంబంధాలు తగ్గాయని ఆయన చెప్పారు. 

జగన్‌కు లోకేష్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. జగన్‌‌పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  లోకేష్‌పై ఒక్క అవినీతి ఆరోపణను నిరూపించారా అని ఆయన ప్రశ్నించారు.

2019 ఎన్నికల్లో టిడిపి టిక్కెట్టుపై అనంతపురం ఎంపీగా బరిలోకి దిగనున్నట్టు చెప్పారు. టిక్కెట్టు రాదని కొందరు పనిగట్టుకొని ప్రచారం చేన్తున్నారని ఆయన చెప్పారు. తాము టిడిపిలోనే ఉంటామని ఆయన చెప్పారు. టిడిపిని వీడాల్సిన అవసరం తమకు లేదన్నారు.

తాను లండన్ పర్యటనలో ఉన్న సమయంలో జగన్ కూడ లండన్ పర్యటనకు వచ్చాడని ఆయన చెప్పారు. సల్మాన్‌ఖాన్ దబాంగ్-3 సినిమా ప్రమోషన్‌లో భాగంగా తాను లండన్‌కు వెళ్ళినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు. లండన్‌లో తాను జగన్‌ను కలవలేదని ఆయన చెప్పారు.