హైదరాబాద్: వ్యాపారవేత్త రాంప్రసాద్‌ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని కోగంటి సత్యం స్పష్టం చేశారు. తనపై ఆరోపణల వెనుక  టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ఉన్నారని ఆయన ఆరోపించారు.

ఆదివారం నాడు ఓ తెలుగు న్యూస్‌ ఛానెల్‌తో ఆయన మాట్టాడారు. కామాక్షి స్టీల్స్ ‌లో తనతో పాటు బొండా ఉమ కూడ వ్యాపార భాగస్వామిగా ఉండేవాడన్నారు. రాజకీయాల్లోకి వెళ్లే ముందు బొండా ఉమ తన వాటా కింద ఉన్న షేర్లను రాంప్రసాద్‌కు విక్రయించాడన్నారు.

రాంప్రసాద్‌ తనకే రూ. 23 కోట్లు ఇవ్వాలన్నారు. రాంప్రసాద్‌ను చంపితే తనకు డబ్బులు ఎవరు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. తనకు డబ్బులు ఇవ్వాలని అడిగినప్పుడల్లా తనపై తప్పుడు కేసులు పెట్టారని  రాంప్రసాద్‌పై సత్యం ఆరోపణలు చేశాడు.

రాంప్రసాద్‌ను చంపాలంటే తనకు ఒక్క నిమిషం పని కాదన్నారు. తాను సైగ చేస్తే రాంప్రసాద్‌ను విజయవాడలోనే చంపేసే వారన్నారు. కానీ, తనకు ఆ ఉద్దేశ్యం లేదన్నారు. రాంప్రసాద్ హత్య విషయంలో తనపై ఆరోపణలు కుటుంబసభ్యులు ఆరోపణలు చేయడం వెనుక కూడ బొండా ఉమ ఉన్నాడని ఆయన ఆరోపించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాను వైఎస్ఆర్‌సీపీ అనుకూలంగా ప్రచారం చేయడం వల్లే బొండా ఉమ కక్షగట్టారని ఆయన ఆరోపించారు. మేరీ క్యాస్టింగ్ కంపెనీకి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇవాళ ఉదయం టీవీలో వార్తలు చూసే వరకు కూడ రాంప్రసాద్  హత్య చేసిన విషయం తనకు తెలియదన్నారు.

రాంప్రసాద్‌కు అతని బావమరిదితో కూడ గొడవలున్నాయన్నారు. తనతో పాటు చాలా మందికి కూడ రాంప్రసాద్‌ డబ్బులు ఇవ్వాలన్నారు. రాంప్రసాద్ హత్య విషయంలో పోలీసుల విచారణకు తాను సహకరిస్తానని ఆయన స్పష్టం చేశారు.

మూడు రోజుల క్రితం తాను తిరుపతికి వెళ్లానన అక్కడి నుండి చికిత్స కోసం హైద్రాబాద్‌కు తిరిగి వచ్చినట్టుగా ఆయన తెలిపారు. రాంప్రసాద్‌ను తాను ఏనాడూ కూడ బెదిరించలేదని  ఆయన చెప్పారు.