ఎంపీల జోక్స్ కట్‌పేస్ట్, జరిగింది ఇదీ: సీఎం రమేష్

No compramise on steel factory issue sasy TDP MP CM Ramesh
Highlights

కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై  తాను చిత్తశుద్దితో దీక్ష చేసినట్టు టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చెప్పారు. మరో వారం రోజులు తనకు దీక్ష చేసే వక్తి ఉందన్నారు. వెయిట్ లాస్ దీక్షలంటూ ఎంపీలు చేసిన కామెంట్స్ కు సంబంధించి ఆ రోజు ఏం జరిగిందో ఆయన వివరించారు. ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆయన వెల్లడించారు.


కడప: కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ  తాను చిత్తశుద్దితో దీక్ష చేసినట్టు టీడీపీ ఎంపీ  సీఎం రమేష్ చెప్పారు. టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో కూడ  తాను  మీడియాను తన వెంట తీసుకెళ్లినట్టు ఆయన గుర్తుచేశారు. తన దీక్షపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

కడపలో  ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో  టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇటీవల దీక్ష చేశారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  సీఎం రమేష్,  ఎమ్మెల్సీ బీటేక రవి దీక్షలను విరమింపజేశారు.  దీక్ష విరమించిన అనంతరం ఆయన తొలిసారిగా ఓ తెలుగు మీడియా చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

తన దీక్షపై ఓ పార్టీ నేతలు  చేసిన విమర్శలను ఆయన ప్రస్తావించారు. తాను తాగే వాటర్ బాటిల్ ఖరీదు సుమారు  రూ200లకు పైగా ఉంటుందని చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. తాను వాడే వాటర్ బాటిల్ కేవలం రూ.59లు మాత్రమేనని ఆయన గుర్తు చేశారు.  తాను సుమారు పదేళ్లుగా  ఈ బాటిల్ వాటర్ ను మాత్రమే తాగుతున్నట్టు ఆయన చెప్పారు.

దేశ వ్యాప్తంగా  పలువురు చేసిన దీక్షల గురించి అధ్యయనం చేసిన తర్వాత  చిత్తశుద్దితో తాను ఈ దీక్ష చేసినట్టు ఆయన చెప్పారు. తన దీక్షపై ప్రత్యర్ధులు ఆరోపణలు చేస్తారని భావించి... కనీసం టాయిలెట్ కు వెళ్లిన సమయంలో  మీడియాను తన వెంట తీసుకెళ్లేవాడినని ఆయన గుర్తు చేసుకొన్నారు.  తాను 11 రోజుల పాటు దీక్ష చేస్తే 9 కిలోలు తగ్గినట్టు ఆయన చెప్పారు. ఇంటర్వ్యూ చేసే సమయానికి కూడ ఇంకా తాను ద్రవాలను ఆహారంగా తీసుకొంటున్నట్టు ఆయన చెప్పారు.

కేంద్రంలో అధికారంలోకి భాగస్వామ్యులుగా ఉన్న సమయంలో కూడ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు గురించి తాము ఒత్తిడి తెచ్చినట్టు ఆయన చెప్పారు. అయితే ఈ విషయమై ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోవాలని తమకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చెప్పారని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఎన్డీఏ నుండి వైదొలిగిన తర్వాత రాజ్యసభలో తాను ఉక్కు ఫ్యాక్టరీపై గొడవ చేస్తే  టాస్కోఫోర్స్ ను ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు.

కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసేందుకు టీడీపీ ఎంపీలు వెళ్లిన సమయంలో  ఎంపీల మధ్య జరిగిన సంభాషణ గురించి  మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై  సీఎం రమేష్  స్పందించారు.  ఆరోజు ఎంపీల మధ్య జరిగిన సంభాషణపై తాను ఆరా తీసినట్టు ఆయన చెప్పారు. తమ పార్టీకి చెందిన ఓ ఎంపీ పీఏ సెల్‌ఫోన్ లో ఈ వీడియోను తీసి మీడియాకు ఇచ్చారని చెప్పారు. అయితే ఆ వీడియోను తమకు వ్యతిరేకంగా ఉండే ఓ మీడియా సంస్థ తమకు అనుకూలంగా ఉండేలా ఎడిటింగ్ చేసి ప్రసారం చేసిందని ఆయన చెప్పారు.

జూలై 4వ తేదీన విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు కోసం దీక్ష  నిర్వహిస్తున్నామని ఆ దీక్షకు జేసీదివాకర్ రెడ్డిని రాకున్నా ఫరవాలేదని ఆవంతి శ్రీనివాస్ చెప్పారని గుర్తుచేశారు. కడపలోనే ఉక్కు ఫ్యాక్టరీ రాదంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారని చెప్పారు. విశాఖకు వచ్చి జోన్ లేదు గీను లేదని అంటే ఇబ్బందులు వస్తాయని ఆవంతి శ్రీనివాస్ ఆ రోజు అన్నాడని సీఎం రమేష్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఈ సంభాషణకు కొనసాగింపుగానే మురళీమోహన్ మాట్లాడుతూ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం సీఎం రమేష్ చేస్తున్న దీక్ష పట్ల ప్రజల్లో మంచి సానుభూతి వస్తోందని పార్టీకి కూడ మంచి రెస్పాన్స్ వచ్చిందని మురళీమోహన్ చెప్పారని సీఎం రమేష్ చెప్పారు.తాను కూడ తన నియోజకవర్గంలో ఏదో ఒక సమస్య తీసుకొని దీక్ష చేస్తే సమస్య పరిష్కారంతో పాటు వెయిట్ లాసయ్యే అవకాశం కూడ ఉంటుందని చెప్పారని  సీఎం రమేష్ గుర్తు చేశారు. ఇందులో ఏం తప్పుందని ఆయన ప్రశ్నించారు. కానీ ఓ మీడియా తనకు అనుకూలంగా ఎడిట్ చేసి ఆ వ్యాఖ్యలను ప్రసారం చేసిందని ఆయన విమర్శించారు.

తాను ఇంకా వారం రోజుల పాటు దీక్ష చేసే శక్తి ఉందని చెప్పారు.  పార్టీలో పట్టుపెంచుకొనేందుకు తాను దీక్ష చేశానని చెప్పడంలో వాస్తవం లేదన్నారు.ఆదినారాయణరెడ్డి పార్టీలోకి తీసుకురావడంలో తాను కీలకంగా వ్యవహరించిన విషయాన్ని గుర్తుచేశారు. తన కష్టానికి ప్రతిఫలంగానే రాజ్యసభ సభ్యత్వాన్ని రెనివల్ చేశారని సీఎం రమేష్ చెప్పారు. కడపలో ఉక్క ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేవరకు తాను గడ్డం తీయనని ఆయన చెప్పారు.

1989 నుండి తాను పార్టీ కోసం పనిచేస్తున్నట్టు సీఎం రమేష్ చెప్పారు. ఎక్కడ సంక్షోభం వచ్చినా సంక్షోభ నివారణ కోసం తనవంతు ప్రయత్నం చేసినట్టుగా ఆయన గర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డితో తనకు విబేధాలు లేవన్నారు.  కేంద్ర ప్రభుత్వానికి రెండు మాసాలపాటు గడువు ఇచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. రెండు మాసాల్లో కేంద్రం ఉక్కు ఫ్యాక్టరీపై నిర్ణయం తీసుకోకపోతే  అప్పుడు కార్యాచరణను ప్రకటించనున్నట్టు చెప్పారు.


 

loader