ఆంధ్రలో ప్రమాదకర మలుపులు లేకుండా రోడ్లు

no blind curves on Andhra Roads in future
Highlights

ఏటా ఆంధ్రలో 24 వేల రోడ్డు ప్రమాదాలు 8 వేల మరణాలు

ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న మలుపులన్నింటిని  తీసేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

 

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు వెల్లడించారు. అనేక చోట్ల రోడ్డు మలుపులు ప్రమాదకరంగా తయారవుతున్నందున, వాటిని లేకుండా చేసేందుకు చర్యలు మొదలుపెడుతున్నామని ఆయన చెప్పారు.

 

 రాష్ట్రంలో  ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటం, ఎక్కువ మంది మరణిస్తూండటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

 

16వ నెంబర్‌ జాతీయ రహదారిపై పర్యవేక్షణ నిమిత్తం ప్రభుత్వం కొనుగోలు చేసిన 66 రహదారి భద్రత వాహనాలను సీఎం ప్రారంభించారు.  16వ నెంబర్‌ జాతీయ రహదారి డెమోకారిడార్‌గా పిలవబడుతుందని చెప్పారు.

 

అతివేగం వాహనాలు నడపడం, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 24 వేల రోడ్డు ప్రమాదాల్లో 8 వేల మందికిపైగా చనిపోతున్నారని  ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అతివేగం, మద్యం తాగడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకే ఈ గస్తీ వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

 

ఏడాదిలో రోడ్డు ప్రమాదాలలో దేశమంతా  సుమారు 5 లక్షల ప్రమాదాలు జరుగుతుంటే, అందులో లక్షన్నర మంది చనిపోవడం, వేలాది మంది వికలాంగులు కావడం బాధాకరమని  ముఖ్యమంత్రి  అన్నారు.

 

దేశంలోనే తొలిసారి పైలట్ ప్రాజెక్ట్ గా మన రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ హెచ్-16లో 126 వాహనాలు ప్రవేశ పెడుతున్నామని, దీనికోసం  రూ. 8.37 కోట్లు ఖర్చు చేస్తామని ఆయనచెప్పారు.  

 

loader