విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీతో పొత్తు కాంగ్రెసు పొత్తును పెట్టుకోవడం లేదు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ ఊమెన్ చాందీ ఆ విషయాన్ని స్పష్టం చేశారు. ఎపి ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని,త తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన బుధవారం మీడియాతో చెప్పారు. పొత్తులపై ఇప్పటికే ఎఐసిసి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.  

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఊమెన్ చాందీ పిలుపునిచ్చారు. ఎన్నికల వ్యూహంపై ఈ నెల 31వ తేదీన సమావేశమవుతున్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరిలో బస్సు యాత్ర చేస్తామని, 13 జిల్లాల్లో బస్సు యాత్రా సాగుతుందని ఆయన చెప్పారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ నెలాఖరు లోగా ఎన్నికల కమిటీ వేస్తామని, దీనిపై అధిష్టానానికి నివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ లోని 175 శాసససభా స్థానాలకు, 25 లోకసభ స్థానాలకు పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. 

రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఎపికి న్యాయం జరుగుతుందని ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. రాహుల్ ప్రధాని అయితే విభజన హామీలు అమలవుతాయని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం వచ్చే నెల 1వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్ కు మద్దతు ఇస్తున్నట్లు రఘువీరా తెలిపారు. ప్రియాంక ఎంట్రీతో మరోసారి ఇందిరమ్మ గాలులు వీస్తాయని ఆయన అన్నారు.