విశాఖపట్నం:  నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారి భారత భూభాగం వైపు దూసుకువస్తోంది. ఈ నివర్ తుఫాను అంతకంతకు తీవ్రత పెంచుకుంటూ తమిళనాడు, పుదుచ్చేరి తీరం దాటే దిశగా ముందుకు కదులుతున్నట్లు ఐఎండి వెల్లడించింది. అనువైన ఉష్ణోగ్రత వుండటంతో తుఫాను  అంతకంతకూ బలపడుతూ తీరంవైపుగా దూసుకొస్తోందని... ప్రమాదకర స్థాయిలో దీని కదలిక వున్నట్లు వాతావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. 

నివర్ తుఫాను తీరందాటే సమయంలో 120-145కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం వుందని... కాబట్టి తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలో  వేటకు వెళ్లరాదని... తీర ప్రాంతంలో నివాసముండే ప్రజలు జాగ్రత్తగా వుండాలన్నారు. 

ఈ తుపాను తీరం దాటే సమయంతో తీవ్రమైన గాలులు వీయడం, భారీ వర్షాలు కురియడంతో పాటు  26,27తేదీల్లోనూ తమిళనాడులోని కడలూర్‌, విళ్లుపురం, కళ్లకురిచ్చి జిల్లాల్లో, పుదుచ్చేరిలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో, ఆగ్నేయ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 25, 26, 27 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 

ఈ హెచ్చరికల నేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరుకు హుటాహుటిన బయలుదేరాడు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్ చక్రధర బాబు,  నెల్లూరు నగర కమిషనర్ దినేష్ కుమార్ తదితరులతో మాట్లాడుతూ తుఫానును ఎదుర్కోడానికి చేపట్టిన చర్యలపై చర్చించి పలు సూచనలు అందించారు మంత్రి అనిల్.