అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం సోమవారం ఉదయం మరింతగా బలపడి వాయుగుండంగా మారింది. మరి కాసేపట్లో తుఫానుగా మారే అవకాశం ఉంది. దీనికి నివర్ అని పేరు పెట్టారు. వాయుగుండ గంటకు 11 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఆగ్నేయ బంగాళాఖాతంలో పాండిచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా 500 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయ దిశగా 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉఉంది. 

నివర్ తుఫాను ఈ నెల 25వల తేదీన తమిళనాడులోని కరైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఏవకాశం ఉంది. ఈ తుఫానుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది.  

తుఫాను ప్రభావంతో 25 నుంచి 27వ తేదీల మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. 

వాయుగుండం తుఫానుగా మారనున్న స్థితిలో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాదహెచ్చరికను జారీ చేశారు. గుంగవరం, కాకినాడ ఓడరేవుల్లో నాలుగో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు 

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండానలి ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్ కె. కన్నబాబు హెచ్చరించారు. వైద్య, ఆరోగ్య శాఖ అదికారులను కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ అప్రమత్తం చేశారు. 

తుఫాను వల్ల ప్రాణ నష్టం జరగకుండా చూడాలని కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి రాజీవ్ గాబా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సూచించారు. ఈ నెల 24, 26 తేదీల మధ్య ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాలపై తుఫాను ప్రభావం పడే అవకాశం ఉందని భారత వాతావరణ పరిశోధన సంస్థ డైరెక్టర్ జనరల్ చెప్పారు.