న్యూడిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి కూడా సుధీర్ఘకాలం సీఎంగా, ప్రతిపక్ష నేతగా పనిచేసిన అనుభవం నారా చంద్రబాబు నాయుడిది. కరోనా మహమ్మారి విజృంభణతో యావత్ దేశం విపత్కర పరిస్థితుల్లో వున్న సమయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తన పాలనా అనుభవంతో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితులతో ఎలా పోరాడాలో ఇరు ప్రభుత్వాలకు సూచనలిస్తున్నారు. అయితే ఈ సలహాలు, సూచనలు తమకు అవసరం లేదని వైసిపి ప్రభుత్వం అంటుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం వీటిని పాటిస్తోందట. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ 19వ తేదీన చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖపై రాజీవ్ కుమార్ స్పందించారు. ముఖ్యంగా జీఎఫ్ఎస్‌టీ తరపున విలువైన సూచనలతో నివేదిక అందించారని ప్రశంసిస్తూ చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. 

''లాక్ డౌన్ నిర్వహణలో కొత్త సంస్థాగత విధానానికి శ్రీకారం చుట్టారు. డేటా ఆధారిత విధానాన్ని అవలంబించేందుకు ప్రభుత్వం కృషి చేసింది. సాంకేతిక పరిష్కారాలు ఏర్పాటు చేస్తోంది. హాట్ స్పాట్లు, ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేసే చర్యలను కేంద్రం చేపట్టింది. మీ అధ్యయనాలు పరిశీలించాలని సహోద్యోగులకు సూచించి  డేటా సేకరణ వంటి ముఖ్యమైన సూచనలు చేశారు'' అని చంద్రబాబుకు రాసిన లేఖలో రాజీవ్ పేర్కొన్నారు. 

''మీ చొరవ, విలువైన మద్దతుకు కృతజ్ఞతలు వివిధ స్థాయిల్లో చేసిన ప్రయత్నాలతో గొప్ప నివేదిక అందించారు'' అంటూ చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్.