ఆలయాలపై దాడుల వెనుక టీడీపీ, బీజేపీ ఉందన్న డీజీపీ వ్యాఖ్యలపై టీడీపీ నేత, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చోడు, మతిస్థిమితం లేని వ్యక్తులు ఈ దాడులు చేసారని ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు.

పెద్దాపురంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన... ఆలయాలు, విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని పట్టుకోవడం చేతగాక ప్రతిపక్షాలపై ఆరోపణలు చేస్తోందని నిమ్మకాయల విమర్శించారు. 

డీజీపీ హిందుత్వ మనుగడను ప్రశ్నించేలా దాడులు జరుగుతుంటే నిందితులను పట్టుకోలేక అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ఆయన ఎద్దేవా చేశారు.

Also Read:అనుకుంటే లోకేష్ మీద కేసు పెట్టలేమా?.. అనిల్ కుమార్ యాదవ్ సంచలనం...

నిన్నటి వరకు విగ్రహాల ధ్వంసం పిచ్చోళ్లు, దొంగలు, జంతువుల పని అని అన్న డీజీపీ ఒక్కరోజులో జే టర్న్ ఎందుకు తీసుకున్నారో సమాధానం చెప్పాలని రాజప్ప డిమాండ్ చేశారు.

పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. ఆలయాల్లో దాడులకు పాల్పడిన ఒక్క నిందితుడిని అరెస్ట్ చేయలేకపోయారని రాజప్ప దుయ్యబట్టారు.

అంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుందని చంద్రబాబు ముందే చెప్పినా డీజీపీ పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా సమగ్రమైన విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయాలని చినరాజప్ప డిమాండ్ చేశారు.