ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత చోటు చేసుకుంది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఎన్నికలకు ఏర్పాట్లు జరగలేదు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఈ రోజు సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరించాల్సి ఉంది. అయితే, జిల్లా అధికార యంత్రంగం ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు షాక్ ఇచ్చేట్లే కనిపిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాలేదు.

జిల్లా యంత్రాంగాలన్నీ దాదాపుగా చేతులెత్తేశాయి. జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేయలేదు. నామినేషన్లకు ముందు అందుబాటులో ఉండబోమని సిబ్బంది చెబుతున్నారు. తాము మాత్రం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అయితే, సిబ్బంది లేకుండా నామినేషన్ల స్వీకరణ ఎలా జరుగుతుందనేది అనుమానంగానే ఉంది. 

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు కూడా జరగలేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ మీద ఈ రోజు సోమవారం విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగానే తాము ముందుకు వెళ్తామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో సుప్రీంకోర్టు తీర్పుపై కూడా ఉత్కంఠ నెలకొంది. 

తొలి దశలో ప్రకాశం, విజయనగరం జిల్లాలు మినహా 11 జిల్లాల్లోని 146 మండలాల్లో పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ప్రభుత్వం పూర్తిగా సహాయ నిరాకరణ ప్రకటించింది. 

జిల్లా అధికారులకు ఎన్నికల ప్రక్రియపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ నుంచి ఉత్తర్వులు వెళ్లలేదు. ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల వివరాలను రిటర్నింగ్ అధికారులు సోమవారం పంచాయతీ కార్యాలయం నోటీసు బోర్డులో పెట్టి, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించాలి. 

దాని కోసం జిల్లా, డివిజన్ పంచాయతీ కార్యాలయాల నుంచి రిటర్నింగ్ అధికారులు ఓటర్ల జాబితాలను, నామినేషన్ పత్రాలను, ఇతర ఎన్నికల సామగ్రిని తీసుకుని ఆదివారమే నిర్దేశించిన గ్రామ పంచాయతీలకు వెళ్లాలి. కానీ అది జరగలేదు. అత్యధిక జిల్లాల్లో ఇప్పటి ఆర్వోల, ఏఆర్వోల ఎంపిక ప్రక్రియ జరగలేదు. కొన్ని జిల్లాల్లో పంచాయతీ అధికారులు ఆర్వోలు, ఏఆర్వోల జాబితాలు సిద్ధం చేసినప్పటికీ కలెక్టర్లు ఆమోద ముద్ర వేయలేదు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ నుంచి జిల్లా కలెక్టర్లకు, జడ్బీ సీఈవోలకు ఉత్తర్వులు వెళ్తున్నాయి. కానీ వారి నుంచి ఎన్నికల కమిషన్ కు ఏ విధమైన సమాచారం అందడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందు ఆయా జిల్లాల్లో ఏయే రెవెన్యూ డివిజన్ల పరిధుల్లో ఎన్నికలు నిర్వహించాలనే సమాచారాన్ని కలెక్టర్లు ఎస్ఈసీకి ఇందించారు. ఆ తర్వాత నుంచి సహాయ నిరాకరణ ప్రారంభమైంది. 

ఎస్ఈసీ రమేష్ కుమార్ శనివారం తలపెట్టిన వీడియో కాన్ఫరెన్స్ కు అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు హాజరు కాలేదు. దీంతో ఎన్నికల ప్రక్రియ కొనసాగింపు మీద సందిగ్ధత నెలకొంది.