ఆర్డినెన్సులు, మధ్యలో ఇంకో కొత్త కమీషనర్, న్యాయపోరాటాల తరువాత ఎట్టకేలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించాడు. ఆయన హైదరాబాద్ నుండి విజయవాడ చేరుకొని ఆయన బాధ్యతలను చేపట్టారు. 

ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అని, రాగద్వేషాలకు అతీతంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందని నిమ్మగడ్డ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గవర్నర్ నోటిఫికేషన్ మేరకు శుక్రవారమే హైదరాబాద్ లోనే బాధ్యతలు చేపట్టానని అన్నారు నిమ్మగడ్డ. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం కార్యదర్శి వాణి మోహన్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు  సమాచారం అందించానాని చెప్పారు. 

గతంలో మాదిరే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయసహకారాలు లభిస్తాయని తాను ఆశిస్తున్నట్టుగా నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఆయన బాధ్యతలు చేపట్టడం ఇది రెండవసారి.

ఇకపోతే... నిమ్మగడ్డ తాజాగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. ఎస్ఈసీగా తనను పునర్నియమించాలని హైకోర్టు ఆదేశించిన నేపత్యంలో న్యాయమూర్తులను అధికార పార్టీ నేతలు తీవ్రంగా దూషించారని ఆయన ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారామ్ నుంచి వైసీపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వరకు న్యాయమూర్తులను దుర్భాషలాడారని, పలువురు సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేశారని ఆయన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

కోర్టు హాళ్ల నుంచి న్యాయమూర్తులు పాలన సాగిస్తారా, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో కోర్టులే నిర్ణయిస్తే ఎన్నికలెందుకు, ఎమ్మెల్యేలూ ఎంపీలనూ ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలని, ప్రభుత్వ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి. ఇది దారుణం అని తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలను ఆయన సుప్రీంకోర్టుకు సమర్పించారు. 

వివిధ పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్ లను ఆయన కోర్టుకు ఇచ్చారు. న్యాయమూర్తులకు రమేష్ కుమార్ కోట్ల రూపాయలు చెల్లించారని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన అఫిడవిట్ లో ఉదహరించారు. హైకోర్టులో నిమ్మగడ్డ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ మీద విచారణను నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఆనయ శుక్రవారం కౌంటర్ దాఖలు చేసారు.