అమరావతి: పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల బదిలీ విషయం మలుపు తీసుకుంది. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ను, ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం సోమవారంనాడు బదిలీ చేసింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వారిద్దరిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో ప్రభుత్వం వారిద్దరిని బదిలీ చేసింది.

వారిద్దరిని బదిలీ చేయడాన్ని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితిలో వారిద్దరిని బదిలీ చేయడం సరి కాదని ఆయన అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. వారిద్దరి బదిలీకి తాను సిఫార్సు చేయలేదని ఆయన అంటున్నారు. దీంతో ఉన్నతాధికారుల బదిలీ మరో వివాదాన్ని ముందుకు తెచ్చింది. 

Also Read: ఇద్దరు ఐఎఎస్‌ల బదిలీ: గోపాలకృష్ణద్వివేది, గిరిజాశంకర్ పై వేటు

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగడానికి సహకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిఫార్సు చేసిన జిల్లాల అధికారులను బదిలీ కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఉన్నతాధికారులను కూడా బదిలీ చేసింది. 

గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రక్రియను నిమ్మగడ్డ రమేష్ కుమార్ రీ షెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే ఆయన చకచకా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. ఎన్నికల నిర్వహణకు కేంద్ర సిబ్బందిని పంపించాలని ఆయన కేంద్ర క్యాబినెట్ సెక్రటరీకి లేఖ రాశారు.

Also Read: ఏక కాలంలో వ్యాక్సినేషన్, ఎన్నికలపై కేంద్రానికి లేఖ: బొత్స సత్యనారాయణ

ఈ నేపథ్యంలో ఏజీ శ్రీరాం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డితో వైఎస్ జగన్ సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల నిర్వహణకు సహకరిస్తామని సమావేశానంతరం సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు