అమరావతి: హైకోర్టు ఆదేశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం బేఖాతరు చేసిన నేపథ్యంలో మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం గవర్నర్ హరిచందన్ ను కలిశారు. తనను తిరిగి ఎస్ఈసీగా నియమించకపోవడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దానిపై విచారణ జరిపిన హైకోర్టు గవర్నర్ ను కలవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సూచించింది.

హైకోర్టు సూచనల మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం ఉదయం గవర్నర్ ను కలిశారు. దాదాపు 40 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. హైకోర్టు ఆదేశాలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు. తిరిగి ఎస్ఈసీగా నియమించాలని ఆయన గవర్నర్ ను కోరారు. ఈ స్థితిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భవిష్యత్తు గవర్నర్ చేతిలోకి వెళ్లింది.

హైకోర్టు ఆదేశాలతోనే తాను గవర్నర్ ను కలిసినట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. తనను ఎస్ఈసీగా నియమించాలని గవర్నర్ ను కోరానని అన్నారు.

అయితే, జగన్ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో గవర్నర్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం అశ్రయించింది.  హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‍లో ఉండగా కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై హైకోర్టు విచారణ జరపడం సరికాదని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. 

హైకోర్టు ఆదేశాలను అమలుచేస్తే సుప్రీంకోర్టులో తాము దాఖలు చేసిన పిటిషన్ నిరర్ధకం అవుతుందని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇలాంటి సమయంలో కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు ముందుకెళ్లడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‍లో అభిప్రాయపడింది.