ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) భారీ షాక్ ఇచ్చింది. చిత్తూరు జిల్లా ఆవులపల్లి రిజర్వాయర్‌కు పర్యావరణ అనుమతిని ఎన్జీటీ చెన్నై బెంచ్ రద్దు చేసింది.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) భారీ షాక్ ఇచ్చింది. చిత్తూరు జిల్లా ఆవులపల్లి రిజర్వాయర్‌కు పర్యావరణ అనుమతిని ఎన్జీటీ చెన్నై బెంచ్ రద్దు చేసింది. అదే సమయంలో రూ. 100 కోట్ల జరిమానా విధించింది. పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) అధ్యయనం, పబ్లిక్ హియరింగ్‌ను తప్పించడం ద్వారా పర్యావరణ అనుమతిని పొందే ప్రయత్నం చేసినందుకు ఎన్జీటీ ఏపీ ప్రభుత్వానికి ఈ మొత్తం జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని మూడు నెలల్లోగా కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ)కి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ- ఆంధ్రప్రదేశ్ ఆవులపల్లి రిజర్వాయర్‌కు మంజూరు చేసిన పర్యావరణ అనుమతిని సవాలు చేస్తూ గుత్తా గుణశేఖర్‌, మరికొందరు ఎన్జీటీని ఆశ్రయించారు. పిటిషనర్ల తరపున కె శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. గాలేరు నగరి సుజల స్రవంతి పథకం నుండి 3.5 టిఎంసి అడుగుల నీటిని నిల్వ చేయడం ద్వారా 40,000 ఎకరాల కొత్త కమాండ్ ఏరియాను రూపొందించడానికి, 20,000 ఎకరాల ప్రస్తుత ఆయకట్టు కోసం ఆవులపల్లి ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు తెలిపారు.

3.5 టీఎంసీల నీటి నిల్వ కోసం ప్రాజెక్టును ప్రతిపాదించినా.. పర్యావరణ అనుమతి కేవలం 2.5 టీఎంసీలకే వచ్చిందని శ్రవణ్ కుమార్ వాదించారు. అటవీ భూమిని వినియోగించుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంపాక్ట్ అసెస్‌మెంట్ స్టడీ చేయలేదని.. కాలువల కోసం భూసేకరణ వివరాలను ఎస్‌ఈఐఏఏ-ఏపీకి సమర్పించలేదని అన్నారు. అయితే ఈ క్రమంలోనే ఎన్జీటీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 100 కోట్లు జరిమానా విధించింది. ఆవులపల్లి రిజర్వాయర్‌కు పర్యావరణ అనుమతిని రద్దు చేసింది.