Asianet News TeluguAsianet News Telugu

అమరావతిపై నిజ నిర్ధారణ కమిటి..ఎన్జీటి హెచ్చరిక

  • రాజధాని నిర్మాణాలపై నిజ నిర్ధారణ కమిటి వేస్తామని హెచ్చరిక
  • పర్యావరణ చట్టం ఉల్లంఘనలపై తలంటిన ఎన్జీటి
  • నేడు కూడా కొనసాగనున్న విచారణ 
ngt

రాజధాని వ్యవహారానికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జిటి) నిజ నిర్ధారణ కమిటి వేయనున్నదా? పరిస్ధితులు చూస్తుంటే నిజమేనని అనిపిస్తోంది. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన విచారణ పద్దతి చూస్తే త్వరలో ఎన్జీటి తరపున ఒక స్వతంత్ర కమిటి అమరావతిలో పర్యటించేట్లే కనబడుతోంది. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతున్న ఎన్జీటి స్వతంత్రంగా ఒక కమిటిని వేసి నిజనిర్ధారణ చేయించాలని అనుకుంటున్నట్లు ప్రభుత్వ న్యాయవాదికి స్పష్టంగా చెప్పటం గమనార్హం. క్షేత్రస్ధాయిలో అమరావతి నిర్మాణ ప్రక్రియకు సంబంధించి అన్నీ వాస్తవాలను తమ ముందు ఉంచకపోతే నిజనిర్ధారణ కమిటిని వేసి తామే నిజాలను గ్రహిస్తామని  తీవ్రంగా వ్యాఖ్యానించింది.

 అంతే కాకుండా విచారణ సందర్భంగా పలు అంశాలపై ప్రభుత్వానికి గట్టిగా తలంటింది. రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో 35 వేల ఎకరాలను తీసేసుకోవటం, పర్యావరణానికి హాని కలిగించే విధంగా కాంక్రీటు నిర్మాణాలు చేపట్టటం తదితరాలను కారణాలుగా చూపుతూ పలువురు పర్యావరణ ప్రేమికులు ఎన్జిటిని ఆశ్రయించారు. అదీకాకుండా రాజధాని నిర్మాణాల పేరుతో ప్రభుత్వం పర్యావరణ అనుమతులు కూడా తీసుకోకుండానే నిర్మాణ ప్రక్రియను చేపట్టిందని ఆరోపణలు వినబడుతున్నాయి.

 దాంతో ఎన్జీటికి మండింది. దాఖలైన పిటీషన్ల ఆధారంగా ప్రభుత్వానికి ఎన్జీటి నోటీసులను జారీ చేసింది. అయితే, పిటీషనర్ల వాదన ఒక రకంగాను, ప్రభుత్వ వాదన మరోరకంగాను ఉన్నది. దాంతో ఎన్జీటి కూడా మొదట్లో కొద్దిగా అయోమయంలో పడింది. అయితే, నిర్మాణాల ప్రక్రియకు సంబందించి పిటీషనర్లు దాఖలు చేసిన ఆధారాలను గమనించిన ఎన్జీటి ప్రభుత్వంపై తరువాత సీరియస్ అయింది.

అప్పటి నుండి విచారణ సందర్భంగా ఒకవిధంగా పిటీషనర్లు సమర్పించిన ఆధారాలపైనే ఎన్జీటి కూడా ఆధారపడుతోంది. ఎందుకంటే, ప్రభుత్వం తరపున అన్నీ ఆధారాలను సమర్పించటంలో ప్రభుత్వ న్యాయవాదులు విఫలమయ్యారని ఎన్జీటి కూడా భావించటమే కారణం.

   మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా ఎన్జీటి మాట్లాడుతూ, వేలాది ఎకరాల పంట పొలాలను సేకరించిన ప్రభుత్వం ప్రత్యమ్నాయంగా రైతులకు ఎటువంటి జీవనోపాధిని కల్పించారని ప్రశ్పించింది. రాజధాని నిర్మాణానికి పెద్ద అవరోధంగా ఉన్న కొండవీటి వాగు దిశమార్చటం ఎందుకని నిలదీసింది.

వాగు దిశను మార్చాలని నిర్ణయించినపుడు ఎటువంటి పర్యావరణ అనుమతులు తీసుకున్నారని అడిగింది. అనుమతులు తీసుకోకుంటే పర్యావరణ చట్టాన్ని   ఉల్లంఘించటం కాదా అంటు ధ్వజమెత్తింది. అసలు ముంపు ఉన్న లింగాయపాలెం గ్రామంలో రహదారుల నిర్మాణం ఎలా చేపడతారంటూ ప్రశ్నించింది.

  పచ్చని పంటపొలాల్లోనే ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోందని అంటూ మరి రైతులకు ఎటువంటి జీవనోపాధి కల్పించారన్న ప్రశ్నకు ప్రభుత్వం తరపు న్యాయవాధి సరైన సమాధానం చెప్పలేకపోయారు. అదేవిధంగా కొండవీటి వాగు వల్ల వరద ప్రమాదం ఉందని తెలిసీ నిర్మాణాలు ఎందుకు చేపట్టాలని అనుకున్నారన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది. దాంతో పిటీషనర్లు లేవనెత్తిన అన్నీ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాలంటూ విచారణను బుధవారానికి ఎన్జీటి వాయిదా వేసింది.

   

Follow Us:
Download App:
  • android
  • ios