కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నూతన వధూవరులతో వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తాపడటంతో పెళ్ళిబృందం తీవ్ర గాయాలపాలైంది.
గుడివాడ: పెళ్ళయి కేవలం కొన్ని గంటలు మాత్రమే గడిచింది... వధూవరులిద్దరూ ఇంకా పెళ్ళి బట్టల్లోనే వున్నారు. ఇలాంటి ఆనంద సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆ నవదంపతులను హాస్పిటల్ పాలు చేసింది. రాత్రివరకు భాజాభజంత్రీలు, బంధువుల సందడితో ఆనందం వెల్లివిరిసిన వధూవరుల ఇళ్లలో తెల్లవారేసరికి విషాద వాతావరణం ఏర్పడింది.
వివరాల్లోకి వెళితే... మచిలీపట్నంకు చెందిన ఆదిత్యకు కాకినాడకు చెందిన శ్రావణికి నిన్న(గురువారం) రాత్రే వివాహమయ్యింది. కాకినాడలో అంగరంగవైభవంగా ఈ పెళ్లివేడుక జరిగింది. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల ఆనందోత్సాహాల మధ్య వధూవరులిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

ఇలా రాత్రి కాకినాడలో పెళ్లితంతు ముగించుకుని నవ వధూవరులిద్దరూ కారులో మచిలీపట్నం బయలుదేరారు. ఆ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. తెల్లవారుజామున కారు గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు మండలం కౌతవరం వద్ద ఒక్కసారిగా కారు అదుపుతప్పింది. మంచి వేగంతో వెళుతుండగా ఓ టర్నింగ్ వద్ద కారు అదుపుతప్పి పంటకాలువలోకి దూసుకెళ్లింది. ఓ చెట్టుకు ఢీకొని బోల్తా పడింది.
పంటకాలువలో నీరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున భారీగా పొగమంచు కురియడంతో డ్రైవర్ కు రోడ్డు సరిగ్గా కనిపించక ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారులోని నూతన వధూవరులతో పాటు కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా కాళ్ల పారాణి ఆరకముందే ఇలా ప్రమాదానికి గురయి వధూవరులు గాయాలపాలై పసుపుతో పచ్చగా వుండాల్సిన పెళ్లిబట్టలు రక్తసిక్తమయ్యాయి.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. అయితే అందరికీ తీవ్రంగా గాయాలైనా ఎవరి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఈ పెళ్లి బృందం మచిలీపట్నం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
ఇదిలావుంటే కర్నూలు జిల్లాలోనూ ఇలాంటి ఘోర ప్రమాదమే సంభవించింది. ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట వద్ద ఓ కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బావిలో నీరు ఎక్కువగా వుండటంతో .. కారు కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
బావిలోంచి కారును జేసీబీ సహాయంతో బయటకు తీశారు. గజ ఈతగాళ్ల సాయంతో దాన్ని వెలికి తీశారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు కూడా మృత్యువాత పడ్డారు. కారు పడిన బావి రోడ్డుకు 30 అడుగుల దూరంలో ఉంది. అతి వేగం కారణంగానే కారు బావిలో పడినట్లు స్థానికులు చెబుతున్నారు. కారు రెండు పల్టీలు కొట్టి బావిలో పడిందని చెబుతున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి వుంది.
