వారిద్దరూ ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు. ఒకరు లేనిదే మరొకరు లేనంతగా భావించారు. పెద్దలను  ఎదురించి మరీ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కానీ.. వారి ప్రేమ ఎక్కువ కాలం నిలవలేదు. విధి వారి జీవితంపై చిన్నచూపు చూసింది. చివరకు ఒకరి తర్వాత మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాపూరు మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన శిరీష (30) నగరంలోని జీజీహెచ్‌లో కాంట్రాక్ట్‌ పద్ధతిపై స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తూ పొదలకూరురోడ్డు జెడ్పీ కాలనీలో నివాసం ఉంటోంది. ఆమెకు గూడూరు అయ్యవారిపాళేనికి చెందిన జగదీష్‌తో పరిచయమైంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలనెదిరించి గతేడాది అక్టోబర్‌ 29వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నారు. 

అయితే.. అనూహ్యంగా డిసెంబర్‌లో జగదీష్‌ గుండెపోటుతో మృతిచెందాడు. భర్త హఠాన్మరణం చెందడం, కుటుంబసభ్యులు దూరంగా ఉండడంతో శిరీష తీవ్రమనోవేదనకు గురైంది. స్నేహితులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈనెల ఆరో తేదీన శిరీష తనకు తోడుగా స్నేహితురాలు రమాదేవిని ఇంట్లో చేర్చుకుంది. 

7వ తేదీ సాయంత్రం కళ్లు తిరుగుతున్నాయని శిరీష స్నేహితురాలికి చెప్పింది. దీంతో ఆమెను జీజీహెచ్‌కు తీసుకెళ్లింది. శిరీషను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. ఇద్దరూ రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది. ఇరు కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.