విశాఖపట్నం: ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆత్మహత్య చేసుకుంటానంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టి గత శనివారం స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. అయితే అతడి అదృశ్యం వెనుక స్టీల్ ప్లాంట్ ప్రయోజనాల కంటే వ్యక్తిగత వ్యవహారం దాగివుందని తాజాగా బయటపడింది.  

స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి శ్రీనివాసరావు భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే స్టీల్ ప్రైవేటీకరణ ప్రకటన నేపథ్యంలో ఉద్యోగాల కోసం ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని బాధితుల నుండి ఒత్తిడి పెరగడంతో శ్రీనివాసరావు పరారీ అయినట్లు తెలుస్తోంది. ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువత నుండి శ్రీనివాసరావు దాదాపు రూ.2కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. 

శ్రీనివాసరావు కనిపించకుండాపోయిన విషయం తెలిసి భాదితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ అంశం బయటకు రావడంతో మరికొంత మంది బాధితులు కూడా బయటకు వచ్చారు. ఇలా  శ్రీనివాసరావు చేతిలో మోసపోయిన బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 

 శ్రీనివాసరావు కాల్ డేటాను సేకరిస్తున్న పోలీసులు దీని ద్వారా అతడి చేతిలో ఎంతమంది మోసపోయారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలాగే అతడి ఆఛూకీ కోసం ప్రత్యేక పోలీస్ టీంలు గాలింపు చేపట్టాయి. 

తాను సాయంత్రం ఫర్నేస్ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటానని శ్రీనివాసరావు సూసైడ్ నోటులో రాశాడు. 5 గంటల 49 నిమిషాలకు ఆత్మహత్య చేసుకుంటానని తెలిపాడు. అయితే ఎక్కడా అతడు  ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఇప్పటివరకు గుర్తించలేదు. 

అందరూ కలిసికట్టుగా ఉద్యమం సాగిస్తేనే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఆపగలమని ఆయన అన్నారు. 32 మంది ప్రాణాల త్యాగాల ఫలితంగా ఉక్కు కర్మాగారం విశాఖకు వచ్చిందని ఆయన చెప్పారు.  ఎట్టి పరిస్థితిలోనూ విసాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం కాకుండా చూడాలని ఆయన అన్నారు. విశాఖ ఉక్కు కార్మిక గర్జన ఉద్యమంలో ఓ మైలురాయి కావాలని ఆయన సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు.