ఎన్నో ఆశలతో పెళ్లి పీటలు ఎక్కారు. భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నారు. కానీ అవేమీ తీరకుండానే ఈ లోకాన్ని విడిచారు. నూతన వధూవరులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విశాఖపట్నానికి చెందిన యడ్లపల్లి వెంకటేష్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి గుంటూరు జిల్లాకు చెందిన  ఆలపాటి మానస నవ్య తో వివాహం నిశ్చ యమైంది. ఈ నెల 14న వారు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

తెనాలి సమీపంలోని గోవాడ గ్రామంలో నవ్య ఇంటివద్దనే మూడు రోజులు ఆనందంగా గడిపారు. తమ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలో ప్రణాళిక వేసుకున్నారు. భర్త వెంకటేష్‌ ఇంటికి విశాఖపట్నం జిల్లా సబ్బవరానికి కారులో బయలుదేరారు. 

కారు డివైడర్‌ను ఢీకొట్టి ఆవలి వైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జు అయింది. నవ దంపతుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ దుర్ఘటనలో కారు డ్రైవర్‌ కూడా ప్రాణాలు కోల్పోయాడు. కాగా..వధూవరులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఇరు కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కారు ప్రమాదం ఎలా జరిగిందనేది ప్రశ్నార్థకంగా మారింది. కారు డ్రైవర్‌ కునుకుతీయడంతో అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుందా, లేక మరేదైనా కారణమా అనేది నిర్ధారణ కావలసి ఉంది. పెళ్ళి కుమార్తె నవ్య సోదరుడు భరత్‌ చెప్పే విషయాలను బట్టి.. ఏదో లారీ తమ కారును పక్కనుంచి బలంగా ఢీకొట్టటంతో తమ కారు గాలిలో ఎగురుతూ డివైడర్‌ దాటి అటువైపు దూసుకుపోయిందని చెబుతున్నాడు. కారు టైర్‌ పంక్చర్‌ కావటంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఆవలి వైపుకు వెళ్లి లారీని ఢీకొట్టి ఉంటుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసును పోలీసులు విచారణ చేస్తున్నారు.