విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో ఇటీవల శ్రీరాముడి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసిపి ప్రభుత్వం అలసత్వం వల్లే ఈ దాడులు జరిగాయని బిజెపి, టిడిపి, జనసేన పార్టీలతో పాటు హిందూసంఘాలు ఆరోపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన జగన్ సర్కార్ దిద్దుబాటు చర్యలను చేపట్టింది.

టిటిడి ఆధ్వర్యంలో ధ్వంసమైన విగ్రహాల స్థానంలో ప్రతిష్టించడానికి నూతన విగ్రహాలు తయారుచేయించారు. విగ్రహాల తయారీ పూర్తవడంతో ఇవాళ(గురువారం) శాస్త్రోక్తంగా ప్రతిష్టా కార్యక్రమాన్ని చేపట్టారు. నూతన సీతారామలక్ష్మణ విగ్రహాలను ఉదయం 8.58 గంటలకు బాలాలయంలో ప్రతిష్టించారు. 

విగ్రహాల ప్రతిష్ట ఉత్సవాల్లో భాగంగా గత మూడు రోజులుగా రామతీర్థంలో ఉదయం, సాయంత్రం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే అర్చనలతో పూజలు ప్రారంభించి... అష్టకలశ స్నపనం, పంచగవ్యం పూజలను నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేదిక్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో శిష్య బృందం, దేవాలయ అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులు, కిరణ్‌, పాణంగిపల్లి ప్రసాద్‌, పవన్‌కుమార్‌, గొడవర్తి నరసింహాచార్యులు, రామగోపాలాచార్యులు పూజల్లో పాల్గొన్నారు